పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మరో అల్లర్ల ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి రోడ్ షోలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. అనంతరం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిడ్నాపూర్ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పోటీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరేగింపుపై గాజు సీసాలు, రాళ్లు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను రాష్ట్ర అధికార టీఎంసీ కొట్టిపారేసింది. కాగా ఈ ఘటనలో చక్రవర్తి, పాల్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
మిడ్నాపూర్ కలెక్టరేట్ మలుపు నుండి ప్రారంభమైన రోడ్ షో కెరనిటోలా వైపు వెళుతుండగా వందలాది మంది బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా, మిథున్ చక్రవర్తి, అగ్నిమిత్ర పాల్ జనానికి అభివాదాలు తెలిపారు. ఈ రోడ్ షో షేక్‌పురా మలుపు వద్దకు చేరుకోగానే రోడ్డుపక్కన నిలుచున్న కొందరు ఊరేగింపుపై రాళ్లు, సీసాలు విసిరారు. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడులకు దిగడంతో ఘర్షణ చెలరేగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయంతో తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి గూండాయిజానికి పాల్పడుతోందని అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. మిథున్ చక్రవర్తి లాంటి ప్రముఖ నటుడిని అవమానించేలా వారు ప్రవర్తించారన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి త్రినాంకుర్ భట్టాచార్య బీజేపీ నేత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రోడ్ షో ఫ్లాప్ కావడంతో బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment