
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఒక్క కార్యక్రమమైనా చేపట్టకపోగా, సొంత ప్రయోజనాల కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. టీడీపీని, మరిది చంద్రబాబును కాపాడటమే పనిగా పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వ్యత్తి రీత్యా తాను వైద్యుడిని అయినప్పటికీ 1986లో ఏబీవీపీతో మొదలుపెట్టి.. పార్టీ అనుబంధ విభాగాల్లో 37 ఏళ్లుగా పని చేస్తున్నానని తెలిపారు. ఇప్పటిదాకా పని చేసిన వారంతా రాష్ట్రంలో పార్టీని అంతో ఇంతో బలోపేతం చేసేందుకు ప్రయత్నించారన్నారు. కానీ, పురందేశ్వరి మాత్రం పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ‘బీజేపీని అభివృద్ధి చేయడం కంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పాకులాడుతున్నారు.
పొత్తులో భాగంగా ఒక్క ఎంపీ సీటు అయినా తీసుకుని అందులో పోటీ చేసి గెలిచి, ఏపీ కోటాలో కేంద్ర మంత్రి అయిపోదామన్నదే మీ తాపత్రయం. జనసేన పార్టీని ఉద్దేశ పూర్వకంగా టీడీపీ వైపు మళ్లించింది మీరు కాదా? టీడీపీతో పొత్తు లేకపోతే బీజేపీని వీడి, టీడీపీలో చేరేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నది నిజం కాదా? కాదని ప్రమాణం చేయగలరా?’ అని ఆయన నిలదీశారు.
మీరు తప్పుకుంటేనే బీజేపీకి మేలు
రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ కులతత్వంతో ఏపీ బీజేపీని పూర్తిస్థాయిలో భ్రష్టు పట్టిస్తున్నారని సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీలో కార్యకర్తల మధ్య కులాల ప్రాధాన్యత ఎప్పుడూ ఉండేది కాదని, ఇప్పుడు పురందేశ్వరి 40% పదవులు ఆమె సొంత సామాజికవర్గం వారికి కట్టబెట్టారన్నారు. తద్వారా రాష్ట్ర బీజేపీలో కులాల చిచ్చు రేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వలాభం కోసం పార్టీలు మార్చే వారికి పెద్దపీట వేసి, పార్టీని నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
‘చంద్రబాబు అరెస్టు అయితే తెలుగుదేశం కార్యకర్తల కంటే ముందే పురందేశ్వరి ఖండించిన మాట వాస్తవం కాదా? టీడీపీ బలహీన పడుతున్న సమయంలో బీజేపీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి.. టీడీపీని ఎలా కాపాడుకోవాలో కుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టడం నిజం కాదా? లోకేశ్‌ను బీజేపీ జాతీయ నాయకుల దగ్గరికి దగ్గరుండి తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసం? పార్టీ కోసం శ్రమించే నాలాంటి వందలాది మంది నాయకులు మీ తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో ఇసుక స్కామ్ అంటూ హడావుడి చేసి.. జేపీ సంస్థ నుంచి ఆ ర్థిక ప్రయోజనాలు పొంది సైలెంట్ అయ్యారన్నది నిజం కాదా? మీరు, మీ కుటుంబ సభ్యులు మద్యం కంపెనీలతో బేరాలాడుతున్న మాట నిజమా.. కాదా? మీ రహస్య అజెండా మేరకే పని చేస్తుండటం అందరికీ కనిపిస్తోంది’ అని సుబ్బారెడ్డి మండిపడ్డారు.
‘పార్టీ నేతలను నోరెత్తనీయడం లేదు. ఎవరైనా మాట్లాడితే బెదిరింపులు పాల్పడుతున్నారు. చివరికి సోము వీర్రాజు వంటి వారిపైనా వేధింపులకు దిగుతున్నారు. నిజాయితీగా పని చేస్తున్న వారిని పార్టీ నుంచి తరిమివేయాలని కుట్రలు చేస్తున్నారు. మీరు పని చేస్తున్నది మీ ఆస్తులను పెంచుకోవడానికి, మీ మరిది చంద్రబాబు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష స్థానం నుంచి మీరు తప్పుకుంటేనే బీజేపీకి మేలు జరుగుతుంది. పార్టీని కాపాడుకోవడానికి కార్యకర్తలు నడుం బిగించాలి’ అని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment