Suspense Continues On Etela Rajender Huzurabad MLA Post - Sakshi
Sakshi News home page

Etela Rajender: ఈటల ఎమ్మెల్యే పదవిపై తొలగని ఉత్కంఠ

Published Thu, May 6 2021 9:32 AM | Last Updated on Thu, May 6 2021 3:35 PM

Suspense On Etela Rajender MLA Post - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తదుపరి అడుగులపై స్పష్టత రావడం లేదు. రెండ్రోజులు హుజూరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన.. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సుదీ ర్ఘంగా చర్చించారు. బుధవారం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ తనను వదిలించుకోవాలనే నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టత రావడంతో.. ఆచితూచి అడుగులు వేయాలని ఈటల భావిస్తున్నారు.

అధినేత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెదిలిన నేత ఈటల. అందుకే.. ఆవేశంతో కాకుండా ఆలోచనతోనే టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని ఎదుర్కోవాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలు స్తోంది.‘పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. వేరే పార్టీ ల్లో చేరిక.. సొంత పార్టీ స్థాపన’ అనే అంశాలపై మేథోమధనం చేస్తున్నారు. బలమైన శత్రువును ఎదుర్కోవలసి వ చ్చినప్పుడు అన్నివిధాల సమాయత్తమై అడుగులు వేయాల్సి ఉంటుందని తన సన్నిహితులతో జరిపే సంభాషణల్లో వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ ఈటలపై దాడిని పెంచింది. ఆయన స్వయంగా పార్టీని వదిలి పోయేలా పథకాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ సస్పెండ్‌ చేసే వరకూ ఇదే ధోరణి.. 
టీఆర్‌ఎస్‌తో సుమారు 20 ఏళ్ల అనుబంధాన్ని నైతి కంగా ఇప్పటికే తెంచుకున్నప్పటికీ, సాంకేతికంగా ఈటల రాజేందర్‌ అధికార పార్టీ ఎమ్మెల్యేనే. మెదక్‌ జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన భూముల వ్యవహారంలో దోషిగా చూపించి మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో తొలగించారని భావించిన ఆయన హుజూరాబాద్‌కు వెళ్లిన తరువాత తన సన్నిహితులతో చర్చించి పార్టీకి, పదవికి రాజీనా మా చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన మాత్రం ‘హైదరాబాద్‌ వెళ్లిన తరువాత’ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షం ఊసు లేకుండా అన్ని ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న తీరు, పార్టీ అధినేత కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు.. ఇవన్నీ తెలిసిన ఈటల తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి వర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో తనకు తానుగా పార్టీకి రాజీనామా చేస్తే.. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవలసిన అనివార్య పరిస్థితులు తలెత్తుతాయి. కొత్తగా పార్టీ స్థాపించినా, వేరే ఏ పార్టీలోకి వెళ్లినా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద గెలిచిన ఎమ్మెల్యే పదవిని కోల్పోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే పరిస్థితి కల్పించాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. ఈలోగా తనపై వచ్చిన మాసాయిపేట భూకబ్జా, దేవరయాంజల్‌ దేవుడి భూముల ఆక్రమణ వంటి ఆరోపణలు నిజం కాదని కోర్టు ద్వారా నిరూపించుకునే పనిలో ఉన్నారు.  

ఆచితూచి అడుగులు 
మంత్రి పదవి నుంచి అకారణంగా తొలగించారనే సానుభూతి జనాల్లోకి వెళ్లిందని భావిస్తున్న ఈటల వర్గం ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటలకు ప్రజలతో ఉన్న సంబంధాల వల్ల స్థానికంగా ఆయనకు వచ్చే ఇబ్బందులేమీ లేవు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్‌ను పెంచుకునే దిశగా ఈటల రాజేందర్‌ అడుగులు వేస్తున్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక పంపాయి. రాష్ట్రంలోని ముదిరాజ్‌ సామాజిక వర్గం అండ ఉందని భావిస్తున్న ఆయన ఇతర బీసీ సంఘాల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు.

అదే సమయంలో పార్టీ ఎప్పుడు సస్పెండ్‌ చేస్తుందా అని కూడా వేచి చూస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. తద్వారా ప్రజల నుంచి సానుభూతి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీ సస్పెండ్‌ చేసినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో కూడా తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించే ధోరణితో ఉన్నట్లు సమాచారం. మరో రెండేళ్లలో వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఇదే టెంపో కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

నిన్నటి సహచరులు.. నేటి శత్రువులు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్‌ తరువాత టీఆర్‌ఎస్‌ అంటే గుర్తుకొచ్చే పేరు ఈటల రాజేందర్‌. ఉద్యమ కాలం నుంచే కాకుండా.. ప్రభుత్వంలోనూ కీలక మంత్రిత్వ శాఖల్లో కొనసాగారు. పార్టీలోనూ ప్రధాన నాయకుడిగా ఉన్నారు. ఇతర మంత్రులు, నాయకులు కూడా అదే స్థాయిలో ఈటలకు గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు భూకబ్జాల ఎపిసోడ్‌ తెరపైకి వచ్చి ఆయన పదవికి గండం రావడంతో నిన్నటి వరకు సహచరులుగా ఉన్నవారంతా శత్రువులయ్యారు. కేసీఆర్‌పై ఈటల స్వరం పెంచడంతో ఉమ్మడి జిల్లాలో సహచర మంత్రులుగా ఉన్న కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈటలపై విరుచుకుపడ్డారు.

గంగుల కమలాకర్‌ మరో అడుగు ముందుకేసి ‘బీసీగా చెప్పుకునే దొర.. మేకవన్నె పులి’ అంటూ విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌పైనే ఇక దృష్టి పెడతామని, నియోజకవర్గంలో పర్యటిస్తామని చెప్పుకొచ్చారు. తాజాగా ఉమ్మడి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈటలపై ఫైర్‌ అయ్యారు. సొంతపార్టీ వారినే ఇబ్బందులకు గురిచేశారని, ఉప ఎన్నికల్లో తానే హుజూరాబాద్‌ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ నేతల దాడి రోజురోజుకూ పెరుగుతుందని తెలుసు కాబట్టే.. ఈటల కూడా సంయమనంతో వ్యవహరిస్తూ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

చదవండి: అసైన్డ్‌ భూమిని ఆక్రమించడం తప్పు కాదా..?
రెండోసారి పవర్‌.. ఈటలపై నజర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement