సాక్షి, నరసరావుపేట, వినుకొండ(నూజెండ్ల): పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై గురువారం వినుకొండ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురు రోడ్డుపై కారును అడ్డగించి కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే బొల్లా గన్‌మెన్ తలపై టీడీపీ జెండాలు కట్టిన వెదురు కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడి నుంచి ఎమ్మెల్యేను రక్షించే క్రమంలో కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సైతం గాయపడ్డారు. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బొల్లా తన కారులో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ మీదుగా వెళుతున్నారు.
అదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారంటూ నిరసన కార్యక్రమం పేరిట వందలాది మంది టీడీపీ కార్యకర్తలు గుమికూడి ఒక్కసారిగా ఎమ్మెల్యే కారును అడ్డగించారు. నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదు. ప్రభుత్వ భూముల్లో మట్టి అమ్ముకున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆయన అనుచరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు, టీడీపీ జెండాలతో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. పోలీసులు వారిస్తున్నా ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు.
సుమారు గంట సేపు కాన్వాయ్‌ని కదలనివ్వకుండా రణరంగం సృష్టించారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను చూసి మరింత రెచ్చిపోయి రాళ్లు, గాజు సీసాలు, కొబ్బరి బొండాలతో దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యేను టీడీపీ శ్రేణుల దాడి నుంచి తప్పించేందుకు పోలీసులు లాఠీచార్జి చేసినా వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్యే కారుపై పెద్దపెద్ద బండలతో దాడి చేశారు.
ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న గన్‌మెన్ నబీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో వినుకొండ టౌన్ సీఐ సాంబశివరావు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రద్దు చేసుకుని పోలీసు బందోబస్తు నడుమ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పోలీసులు వినుకొండ పట్టణంలో 144 సెక్షన్‌ను విధించారు.
పథకం ప్రకారమే దాడి..
మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బొల్లా తగిన ఆధారాలు చూపుతూ తన నిజాయితీని నిరూపించుకుంటూ వస్తున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆగస్టు ఒకటో తేదీన వినుకొండలో జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ మైలేజీ కోసం ఎలాగైనా గొడవలు సృష్టించి అధికార పార్టీపై, స్థానిక ఎమ్మెల్యేపై లోకేశ్‌తో విమర్శలు చేయించాలని ఆంజనేయులు తాపత్రయపడుతున్నారు.
పథకం ప్రకారమే వినుకొండలో సంగం డెయిరీలో కూర్చుని టీడీపీ అల్లరి మూకలను రెచ్చగొట్టి వదిలారు. ముందుస్తు పథకంలో భాగంగానే ఎమ్మెల్యే కారు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయించారు. అదే సమయంలో తమ అనుకూల మీడియాలో మాత్రం వైఎస్సార్‌సీపీ నేతలే తమపై దాడులు చేశారని ప్రచారం చేయించారు.
నాపై దాడికి జీవీ పక్కా ప్లాన్: ఎమ్మెల్యే బొల్లా
వినుకొండ అభివృద్ధి, కార్యకర్తల కోసం తన ప్రాణాలైనాలెక్క చేయనని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. టీడీపీ అల్లరి మూకల దాడి అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఎదగలేక తనను అంతమొందించేందుకు జీవీ ఆంజనేయులు కుట్ర పన్నారని ఆరోపించారు. గతంలో బొగ్గరం తిరునాళ్లలో తన కారుపై రాళ్లురువ్వి దాడులకు పాల్పడ్డారని, మరోమారు తనపై దాడికి జీవీ పక్కా ప్లాన్ వేశారని చెప్పారు.
దాడిని ఖండించిన మంత్రి రజిని
ఎమ్మెల్యే బొల్లాపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు మంత్రి రజిని, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నరసరావుపేటలో వారు మీడియాతో మాట్లాడుతూ కోల్పోయిన తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకే చంద్రబాబు, లోకేశ్ ఇలా దాడులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు వారిని ఎప్పటికీ నమ్మబోరన్నారు.
వినుకొండ ప్రశాంతతను చెడగొడుతున్న జీవీ
‘తన రాజకీయ లబ్ధి కోసం జీవీ అంజనేయులు నిత్యం ఏదో ఒక గొడవ చేస్తూ వినుకొండ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఎమ్మెల్యే బొల్లాను రాజకీయంగా ఎదుర్కొవడం చేతకాక టీడీపీ వర్గాలు ఇలా దాడులకు తెగబడుతున్నాయి.’ – మక్కెన మల్లికార్జున, మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment