
పొత్తుల మారి జిత్తుల నక్కగా మారిన బాబు
నాడు హోదా పేరు చెప్పి మోదీపై తిట్ల దండకం
నేడు కేసుల భయంతో పొత్తు కోసం చక్కర్లు
అవకాశవాదానికే పరాకాష్టగా బాబు రాజకీయాలు
ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబును చూసిన వాళ్లెవరిని అడిగినా.. అడక్కపోయినా చెబుతున్నారు. పెరుగుతున్న వయస్సుకు అదనంగా చంద్రబాబు కళ్లలో ఓటమి భయం, తాను ఓడిపోతే తన పుత్ర రత్నం భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన.. వీటన్నింటికి మించి గతంలో చేసిన పాపాలు, వెంటాడుతున్న తప్పులు.
ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేని ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీపై నమ్మకం లేక, తనపై తనకే బోలెడు భ్రమల మధ్య.. కనీసం హస్తినకు వెళ్లి బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు చంద్రబాబు. వెంట పవన్ కళ్యాణ్. విలువలు లేని రాజకీయాలకు అంబాసిడర్‌లా ఇద్దరు నాయకులు మారారంటూ వైఎస్సార్‌సిపి చేస్తోన్న విమర్శలకు సమాధానం చెప్పలేని దుస్థితి.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఢిల్లీ గల్లీల్లో పొత్తుల కోసం కాలుగాలిన పిల్లిలా చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ నేతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని దత్తపుత్రుడితో కలిసి బేరసారాలాడుతున్నాడు. దీంతో, బీజేపీ ఎన్ని కండీషన్స్ పెట్టినా ఓకే అనేందుకు సిద్ధమయ్యారు. పొత్తులు లేనిదే రాజకీయం చేయలేనని హస్తినలో ప్రదక్షిణలు చేస్తున్నాడు.
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. పథకాల అమలులో అవినీతి, పక్షపాతం లేకపోవడంతో ప్రతీ ఒక్కరూ సీఎం జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని బహిరంగంగానే చెబుతున్నారు. అటు సర్వేలు కూడా మరోసారి వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని నంబర్లతో సహా వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్ ఎప్పటిలాగే ప్రజలతో మమేకమవుతూ ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నులో భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే టీడీపీ హయంలో చేసిన అవినీతిని ప్రభుత్వం బయటకు తీసి మళ్లీ జైలుకు పంపిస్తారని వణికిపోతున్నారు. ఈ క్రమంలో తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌తో కలిసి బీజేపీతో పొత్తుల కోసం ఢిల్లీ బాట పట్టారు. బీజేపీ పెద్దలను ఒప్పించడం కోసం పచ్చ బ్యాచ్ అంతా చంద్రబాబుకు అండగా నిలుస్తోంది. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా బీజేపీలో చేరిన టీడీపీ నేతలు, పవన్.. బీజేపీతో పొత్తు కోసం చాలానే కష్టపడుతున్నారు. ఛీ.. మాకేమీ టీడీపీతో పొత్తు వద్దని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నా చంద్రబాబు మాత్రం సిగ్గులేకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.
అయితే, గతంలో చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకుంటే సగటు కాషాయనేత, కార్యకర్తలకు కోపం రాకుండా ఉండకపోవచ్చు. టీడీపీ, చంద్రబాబుకు వారు ఎలా మద్దతిస్తారు. అందితే తల.. లేకపోతే కాళ్లు అన్నట్టుగా చంద్రబాబు ప్రతీసారి తన ప్రయోజనాల కోసం రాజకీయం చేశారే తప్ప ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదు అనేది అసలైన నిజం. చంద్రబాబు పదవి, ప్రయోజనం కోసమే స్పెషల్ స్టేటస్‌ను గాలికొదిలేశాడు. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికాడు.
ఇప్పుడు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీయేలో చేరడంలో మతలబు ఏంటి?. ఇది రాష్ట్ర ప్రయోజనమా? సొంత పార్టీ ప్రయోజనమా?. ఈ విషయం బాబే చెప్పాలి. మొన్నటి వరకు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు.. ఇప్పుడేమంటారు?. గతంలో ప్రధాని మోదీని టార్గెట్ చేసి మోసాల మోదీ.. మోదీ జిత్తులకు భయపడును.. మోదీపై రాజీలేదు. మోదీ హటావో.. బీజేపీకి సహకరించేవాళ్లు దేశద్రోహులు. మోదీని ఓడించాలనేదే తన లక్ష్యం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బాబోరు ఇప్పుడేం సమాధానం చెబుతారో?.
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనకుంటుంది. అలాగే, చంద్రబాబు కూడా తాను ఏం చేసినా చెల్లుతుంది.. ప్రజలకు ఏమీ తెలియదనుకుంటున్నాడు. తనకు ఎల్లో మీడియా సపోర్టు ఉందని ప్రజలను ఎలాగైనా బుట్టలో వేసుకోవచ్చనే ప్లాన్‌లో ఉన్నాడు. కానీ, బాబు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. సింహంలా సింగిల్‌గా వస్తున్నది ముఖ్యమంత్రి జగన్ అని. పచ్చ నేతలకు, ఎల్లో మీడియాను ఎదుర్కొనేందుకు సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’గా ఉన్నారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై కేశినేని నాని హాట్ కామెంట్స్..
- 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారు
- 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడు
- కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడు
- అప్పట్లో నాతో మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు
- మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు
- 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు
- ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది.
- కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ, అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు
- ఎన్డీయే నుంచి ఎందుకు బయటికి వచ్చాడో.. తిరిగి ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి
- అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి
- ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా?.
- రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా?.
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా?.
- అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా?.
- చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు.
- తను, తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనేది చంద్రబాబు భయం
- టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు
- టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది
- తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది
- 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది.
- చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం పగటి కలే.
- ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు చంద్రబాబు వెళ్లిపోతాడు.