సాక్షి, కరీంనగర్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చరిత్ర ముగిసినట్లయింది. 2014 నుంచి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు అంతా వెళ్లిపోయినా.. ఎల్.రమణ మాత్రం ఇన్నాళ్లు ఎన్టీఆర్ భవన్‌కే అంకితమై ఉన్నారు. చివరికి ఆయన కూడా ఆ పార్టీకి నీళ్లొదిలారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదని భావించి.. కొద్దిరోజుల క్రితమే టీడీపీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి భవిష్యత్ హామీ తీసుకున్నారు.
అనంతరం టీడీపీకి రాజీనామా చేసి, నాలుగు రోజుల క్రితం కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం పొందారు. శుక్రవారం టీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ సమక్షంలో ఎన్టీఆర్ భవన్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉత్తర తెలంగాణలో మిగిలిన ఏకైక పెద్ద నాయకుడు, మాజీ మంత్రి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక తెలుగుదేశం పార్టీ కరీంనగర్‌లోనే గాక తెలంగాణలోనే చరిత్ర పుటల్లోకి చేరుకున్నట్లయింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో మినహా ఆపార్టీకి ఉనికి లేకుండా పోయింది.
సాధారణ నాయకుడి నుంచి టీటీడీపీ అధ్యక్షుడిగా..
1994 సాధారణ ఎన్నికల్లో జగిత్యాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఎల్.రమణ.. 1995లో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా నియమితులయ్యారు. చేనేత వర్గానికి చెందిన బీసీ నాయకుడిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా కరీంనగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి చొక్కారావును ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి బీసీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత విద్యాసాగర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. నాలుగేళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన రమణ..
కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర శాఖలో బీసీ నాయకుడిగా కొనసాగారు. 2009లో మహా కూటమి తరఫున పోటీ చేసి జీవన్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం వచ్చినా.. కాదని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాల పొత్తులో భాగంగా జగిత్యాలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతు ఇచ్చారు. తాజాగా ఇటీవల జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల తరువాత కూడా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం అందినా.. కాదని టీటీడీపీ అధ్యక్షుడిగానే వ్యవహరించారు.
రమణకు తగిన ప్రాధాన్యత ఇస్తానన్న సీఎం కేసీఆర్
‘ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకుడు ఎల్.రమణ. ఆయన 25 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. ఇలాంటి వారు రాజకీయ పార్టీలకు అవసరం. టీఆర్‌ఎస్‌లో చేనేత వర్గం నేత వెలితి ఉండె. రమణ రూపంలో మంచి రాజకీయ నాయకుడిని చూస్తారు. త్వరలోనే రమణకు మంచి పదవి ఇస్తాం’ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో చేనేత వర్గాన్ని ఆకట్టుకునే ఉద్దేశంతో రమణను పార్టీలోకి తీసుకుంటున్నట్లు ఇన్నాళ్లు భావించినప్పటికీ, రాష్ట్రంలో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నట్లు కేసీఆర్ మాటలతో అర్థమవుతోంది.
హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పిన ఆడియో లీక్ కావడంతో హుజూరాబాద్ అభ్యర్థిపై పీఠముడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్.రమణను కూడా అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రమణ గురించి త్వరలోనే మంచి వార్త వింటారు’ అని కేసీఆర్ చెప్పడం వెనుక ఆంతర్యం ఇదేనని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment