
కుప్పం: జనసేన పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కుప్పంలో శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో జనసేన కార్యకర్తల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై పవన్‌కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన కుప్పం కార్యదర్శి నరేష్ కూర్చున్నారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నేతలను పసుపులేటి హరిప్రసాద్ వేదికపైకి అహ్వనించారు.
స్థానిక నాయకులు, కార్యకర్తలను కాకుండా జిల్లా నేతలను మాత్రమే వేదికపైకి పిలవడంపై నరేష్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగిసి చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత హరిప్రసాద్, నరేష్ మధ్య వాగ్వాదం మొదలైంది. పార్టీ కోసం కష్టపడే స్థానిక నేతలను కాకుండా జిల్లా నేతలను ఎందుకు పిలిచారంటూ నరేష్ ఆయన అనుచరులు వాదనకు దిగారు. రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులు, తోపులాటలకు దిగారు.
హరిప్రసాద్ ప్రాణభయంతో కారులో దాక్కున్నారు. కుప్పం జనసేన కార్యకర్తలు పసుపులేటి కారుపై దాడిచేశారు. ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైంది. దీంతో ఆయన ఆ కారులోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో జనసేన కార్యకర్తల విభేదాలు భగ్గుమనడం సర్వత్రా చర్చకు దారితీసింది.