రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు
రాజమహేంద్రవరం సిటీ: అవ్వాతాతలకు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తే వారు వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారని, అదే జరిగితే తాము అడ్డుకుంటామని.. దీనివలన శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ తమ పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి రిటర్నింగ్ అధికారికి చెప్పారని, డీఎస్పీ కూడా అది వాస్తవమని అన్నారని వాసు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారికి లేనందున ఈ విషయాన్ని తమ అధినేత చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. అందువల్లే ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు.
వాసు వ్యాఖ్యలతో దుమారం..
ఇక ఆదిరెడ్డి వాసు చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించింది తామేనని టీడీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటూనే.. పింఛన్లు ఆగిపోవడంతో తమకేమీ సంబంధంలేదని, అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమని మరోవైపు కవర్ చేసుకోవడం వారి రెండు నాల్కల ధోరణికి అద్దంపడుతోందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటున్నారు. ఇక ఎండ తీవ్రత పెరుగుతున్న సమయంలో టీడీపీ నాయకులు ఈ కుట్రలకు తెగబడడంపై వృద్ధులు, దివ్యాంగులు తెలుగుదేశాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. వారివల్లే ప్రతినెలా ఒకటో తేదీ వేకువనే వలంటీర్ల ద్వారా అందే పింఛను ఈ నెలలో తమకు అందకుండాపోయిందని పింఛనుదారులు వారిని శాపనార్థాలు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment