ఆ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తవ్వగానే పసుపు పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పోలింగ్ సరళి తమకే అనుకూలమని డప్పు కొట్టుకున్నారు. కట్ చేస్తే.. తాజా లెక్కలు చూశాక వారిలో ఆందోళన మొదలైందట. ఏదో అనుకుంటే మరేదో జరిగేలా ఉందనుకుని కలవరపడుతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగు తమ్ముళ్ల టెన్షన్‌కు కారణమేంటి?..
కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ టాప్ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకున్న నియోజకవర్గం గుడివాడ. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని శక్తిగా ఉన్న కొడాలి నానిని వైఎస్‌ఆర్‌సీపీ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవకుండా అడ్డుకోవాలనేది టీడీపీ నాయకత్వం బలమైన కోరిక. ఇందుకోసం రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేసింది. కొడాలి నానిపై పోటీకి పనికొచ్చే నాయకులు గుడివాడలో కనిపించక, చివరికి అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును పోటీలో నిలిపింది. కొడాలి నానిని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేసిన వెనిగండ్ల రాము, టీడీపీ నేతలు పోలింగ్ సరళిని చూసి ఖంగుతిన్నారట. 13వ తేదీన జరిగిన పోలింగ్ లో గుడివాడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతం పెరగడానికి మహిళా ఓటర్లలో చైతన్యం ఎక్కువగా కనిపించడమే ప్రధాన కారణం.
మొత్తంగా.. గుడివాడ నియోజకవర్గం అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నందివాడ మండలంలో రెండు కేంద్రాలు, గుడివాడ పట్టణంలోని రెండు కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా లేకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది.
ఇదిలా ఉంటే పోలింగ్ సరళి..పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూ లైన్లను చూసి బోల్డంత ఊహించుకున్న టీడీపీ నేతల ఆశలపై వారే తయారుచేసుకున్న తాజా లెక్కలు నీళ్లు చల్లాయట. రికార్డ్ స్థాయిలో జరిగిన పోలింగ్ సైకిల్ పార్టీకి అనుకూలంగా లేదని వారిలో వారే చర్చించుకుంటున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా తరలి రావడం తమకే కలిసి వచ్చిందని టీడీపీ నేతలు సంబరపడినప్పటికీ, పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలు వారిని కలవరపెడుతున్నాయని టాక్.
భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. మహిళల ఓట్లన్నీ వైఎస్‌ఆర్‌సీపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయట. గడచిన మూడు దశాబ్ధాలుగా గుడివాడ నియోజకవర్గంలో జరగని చాలా అభివృద్ధి పనులు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని చేసి చూపించారు. పేదల సొంతింటి కల టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల రూపంలో ప్రజలకు అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకున్న తరుణంలో మరోసారి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.
తాజా అంచనాలు భయపెడుతున్నా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తమను కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెప్పుకుంటున్నారట టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. లోలోన టెన్షన్ పడుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ ను చూసే మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గెలుపు లాంఛనమే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న చర్చ ప్రస్తుతం గుడివాడలో జోరుగా సాగుతోంది.
ఇదీ చదవండి: ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment