సాక్షి, తిరుపతి: సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. టీడీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన కిందనే టీడీపీ పని చేస్తుందంటూ కార్యకర్తలను ఉద్దేశించి నాగబాబు పేర్కొన్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న జనసేన నేత నాగబాబు.. అక్కడి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు పొత్తు ప్రస్తావన తీసుకొచ్చారు.
టీడీపీ నేతలు గతంలో తమని టార్చర్ పెట్టారని నాగబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. గతాన్ని మరిచిపోయి ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు నాగబాబు సర్దిచెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో .. టీడీపీ మన కిందనే పని చేయాలి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ఉన్నా.. టీడీపీ నాయకులు మన కిందనే పని చేయాలి. టీడీపీతో కలిసి పని చేసినా జనసేన అజెండానే మీరు తీసుకెళ్లాలి అని జనసేన కార్యకర్తలకు సూచించారాయన. అంతేకాదు.. అధికారంలోకి వస్తే పవనే సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
ఇదిలా ఉంటే.. టీడీపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, రాజమండ్రి జైలులో చంద్రబాబు ములాఖత్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ రెండు పార్టీ క్యాడర్‌ల నుంచి అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment