సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కొందరు ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరుతో అయోమయ పరిస్థితులు తలెత్తుతున్నాయని పార్టీ నేతలు, కేడర్ వాపోతున్నారు. మరో నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా కొందరు నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం గందరగోళానికి గురిచేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా గత 2, 3 ఏళ్ల కాలంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు ఎక్కువగా కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, ఇతర సంస్థాగత మార్పులు జరుగుతాయంటూ విస్తృత ప్రచారం జరగడంతో సెగ రాజుకుంది. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లు భేటీ కావడం పార్టీ రెండు వర్గాలుగా చీలిందన్న అభిప్రాయానికి తావిస్తోందని పలువురు నేతలు, కార్యకర్తలు అంటున్నారు. పార్టీకి సంబంధించిన వరుస పరిణామాలపై వెంటనే స్పష్టతనిచ్చి గందరగోళానికి తెరదించాలని నాయకులు కోరుతున్నారు.ల
(చదవండి: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి తప్పిన ప్రమాదం )
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కార్యకర్తలు అయోమయానికి గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూపు సమావేశాలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కూడా కొందరు జాతీయ నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. కాగా ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ ఉన్నందున ఆలోగా జాతీయ నాయకత్వం స్పష్టతనిస్తుందా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీలు సునీల్ బన్సల్, శివప్రకాశ్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ లాంటి వారికి కొందరు ఫోన్లు చేసి ప్రచారంలో వాస్తవికతపై స్పష్టత కోరినట్టు కూడా తెలుస్తోంది.
ఆ సమావేశాల వెనుక ఎవరున్నారు?
రాష్ట్ర పార్టీలో పరిణామాలు, కొన్నిరోజుల క్రితం అసంతృప్త నేతలు, తాజాగా కొందరు ముఖ్యనేతలు వేర్వేరుగా సమావేశం కావడంపై జాతీయ నాయకత్వం ఆరా తీసినట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ సమావేశాల నిర్వహణ వెనుక ఎవరెవరున్నారు? వారు ఏ విషయంలో అసంతృప్తితో ఉన్నారు? రాష్ట్ర పార్టీలో కీలక సంస్థాగత మార్పులు జరగవచ్చనే ప్రచారంపై వారి అభిప్రాయాలు ఏమిటి? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.
రంగారెడ్డితో డీకే అరుణ చర్చలు
ఇదిలా ఉంటే పార్టీలో చేరికలకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ మాఖం రంగారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడైన రంగారెడ్డితో పాటు మరికొందరు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.
(చదవండి: సర్పంచ్, ఉప సర్పంచ్‌ల కాళ్లు, చేతులు నరికేస్తాం.. )
Comments
Please login to add a commentAdd a comment