సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో రాజకీయంగా తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త ఏడాది ప్రథమార్థంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న జాతీయ నాయకత్వం అంచనాలతో రాష్ట్ర పార్టీలో ఉత్సాహం నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన నిరుత్సాహాన్ని అధిగమించి, లోక్‌సభ ఎన్నికల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే దిశలో ముందుకెళ్లాలని సంకలి్పంచింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ విస్తరణకు అనువైన రాష్ట్రంగా తెలంగాణపై జాతీయ నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావించింది. కానీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడంపై పార్టీ శ్రేణులను ఒకింత నైరాశ్యం చుట్టుముట్టింది. దీంతో ప్రస్తుతం దీనిని దూరం చేసే ప్రయత్నాల్లో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో 35 శాతం ఓటింగ్‌తో పది ఎంపీ సీట్లలో గెలవాలంటూ అగ్రనేత అమిత్ షా నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తోంది.
టికెట్ల కోసం తీవ్రమైన పోటీ
నలుగురు సిట్టింగ్ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), అరి్వంద్ ధర్మపురి (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్)లను మళ్లీ బరిలోకి దింపాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా మిగతా 13 స్థానాల్లో టికెట్ల కోసం పార్టీ నాయకులు, తటస్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ పెద్దలు గెలుపు గుర్రాల అన్వేషణలో పకడ్బందీగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు లేదా నలుగురు ఆశావహులతో జాబితాను పంపించాలని ఆదేశించినట్టు సమాచారం.
దీంతో ఆశావహులంతా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలను, ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే వివిధ స్థాయిల్లో నిర్వహించే సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఖరారు కసరత్తు జరుగుతుందని రాష్ట్ర నేతలకు అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment