మీడియాతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజావిశ్వాసం కోల్పోయారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గెలవలేక నీచమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. ధర్మాన్ని కాపాడుకునేందుకు హుజూరాబాద్ ప్రజలు చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. హుజూరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఆర్నెల్లుగా అధికార పార్టీ ఆగడాలను నిలువరించడంలో కలెక్టర్, సీపీలు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ దళితబంధు జీవో ఇవ్వడం పెద్ద ఉల్లంఘన అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇక్కడే తిష్టవేసి ఓటువేయకుంటే దళితబంధు, పెన్షన్ రాదని ప్రజలను బెదిరించారని, కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అధికారపార్టీ ఖూనీ చేసిందని, డబ్బు, మద్యం వాహనాలను పోలీసు ఎస్కార్ట్ పెట్టి మరీ తరలించిందని, డబ్బులు పంచేవారికి పోలీసులు బందోబస్తు కల్పించారని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారన్నారు. బస్సుల్లో తరలిస్తున్న ఈవీఎంలను మార్చినట్టు వార్తలు వస్తున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ధర్మానిదే అంతిమ విజయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, నాయకులు సంపత్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment