
హుజూర్‌నగర్/పెన్‌పహాడ్: ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే సీఎం కేసీఆర్ ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నారని బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పరిధిలో ఆయన పర్యటించారు. పెన్‌పహాడ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ అవసరాలకు పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటోందని ఆరోపించారు.
భూనిర్వాసితులకు మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించట్లేదని మండిపడ్డారు. ఇకపై అధికారులు అసైన్డ్ భూముల సర్వేకు వస్తే అడ్డుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఫణిగిరిగుట్ట వద్ద రూ. 150 కోట్లతో నిర్మిస్తున్న ఆదర్శ కాలనీని ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టు డంపింగ్ యార్డుగా మారడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చడపంగు రవి, నియోజకవర్గ ఇంచార్జ్ సాంబశివగౌడ్, అధ్యక్షుడు కొండమీది నరసింహారావు, కస్తాల కిశోర్, జిలకర రామస్వామి, వాస పల్లయ్య, పిడమర్తి శీను పాల్గొన్నారు.