సమావేశంలో పాల్గొన్న నేతలు షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో రైతుసమస్యలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పార్టీ బృందాలు పర్యటించి రైతు సమస్యలపై నివేదికను టీపీసీసీకి అందించాలని శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. రైతుల సమస్యలపై జిల్లాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
నల్లగొండకు చిన్నారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, సంభాని చంద్రశేఖర్, మెదక్‌కు దాసోజు శ్రవణ్, వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్లకు మల్లు రవి, శివసేనారెడ్డి, కామారెడ్డి జిల్లాకు కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డి, ప్రీతమ్, మెట్టు సాయికుమార్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని, వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంట పొలాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకొని టీపీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 8న ఎర్రమంజిల్‌లోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్‌ను ముట్టడించాలని, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు, దళితబంధు అమలుపై రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12, 13 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు.
కేసీఆర్‌కు రైతుల ఉసురు: రేవంత్‌రెడ్డి
సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరి వేస్తే ఉరేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన ఉద్యమించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో వరికుప్పపై రైతు గుండె ఆగి చనిపోతే సహజ మరణమని కలెక్టర్ నివేదిక ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు ఆగమవుతున్నారని, కేసీఆర్‌కు రైతుల ఉసురు తగలడం ఖాయమని రేవంత్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, చిన్న రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్ను తగ్గిస్తే ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. మానవతా రాయ్, శివసేనా రెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీని అడ్డుకుంటామని హెచ్చరించారు.
సమావేశంలో పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, హర్కర వేణుగోపాల్, ప్రీతం, మెట్టు సాయి, నర్సింహారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment