కంటోన్మెంట్: ‘కిషన్‌రెడ్డి గారూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో చట్టవిరుద్ధంగా మూసేసిన రోడ్ల వివరాలు అడిగారు కదా... ఇదిగో జాబితా.. ఆయా రోడ్లను తక్షణమే తెరిచేలా లోకల్ మిలటరీ అథారిటీస్‌కు ఆదేశాలిస్తూ లక్షలాది మంది స్థానికులకు ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తున్నాం’అంటూ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.
రోడ్ల మూసివేతపై కిషన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితమే కేటీఆర్ ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో చట్టవిరుద్ధంగా రోడ్లను మూసివేసి లక్షలాది మందిని ఇబ్బందులకు గురిచేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. లోకల్ మిలటరీ అథారిటీస్ (ఎల్‌ఎంఏ) నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
రాజ్‌నాథ్‌సింగ్‌కూ...
అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మీ మంత్రికి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన లేనట్లుంది.. కంటోన్మెంట్‌లో మొత్తం 21 రోడ్లు మూసేస్తే, మీ మంత్రి కేవలం రెండే మూసేసినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
‘ఒకవేళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు స్థానికులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే, కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలిపేయండి’అంటూ పేర్కొన్నారు. మొత్తంగా కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య ట్వీట్ యుద్ధం నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment