Telangana: PCC Chief Revanth Reddy Challenge To CM KCR - Sakshi
Sakshi News home page

మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలివిగో!

Published Sat, Aug 28 2021 12:59 AM | Last Updated on Sat, Aug 28 2021 11:41 AM

Telangana: PCC Chief Revanth Reddy Challenge To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మంత్రి మల్లారెడ్డిపై తాను ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్నానని.. ఆయనపై విచారణకు ఆదేశిస్తారో.. లేదో..  కేసీఆర్,  కేటీఆర్‌ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘అవినీతికి ఆలవాలమైన మల్లా రెడ్డిని జైల్లో పెట్టకుండా మంత్రిని చేసి పక్కన కూర్చోబెట్టుకోవడం, న్యాక్‌ నిషేధించిన ఆయన కళాశాలలను వర్సిటీగా గుర్తించడం వంటి చర్యలతో సీఎం తెలంగాణ సమాజానికి ఏం సంకేతాలు ఇవ్వదల్చుకున్నారు’ అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బలరాం నాయక్, మల్లు రవి, నందికంటి శ్రీధర్, హర్కర వేణుగోపాల్, మానవతారాయ్, ఈర్ల కొమురయ్యలతో కలసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. టి.రాజయ్య, ఈటలకు వర్తించిన నిబంధనలు మల్లారెడ్డికి వర్తించవా? అని సీఎంను ప్రశ్నించారు. 

ఆ భూములు ఎక్కడివి.. 
మల్లారెడ్డి వర్సిటీ అనుమతుల కోసం ప్రతిపాదించిన భూములు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ‘గుండ్లపోచంపల్లి పరిధి లోని సర్వేనంబర్‌ 650లో 1965–66 పహాణీ ప్రకా రం.. మొత్తం 22–08 ఎకరాల భూమి ఉంది. 2000–01 పహాణీలోనూ అంతే నమోదైంది. ధరణి పోర్టల్‌ వచ్చే సరికి 33–26 ఎకరాలకు పెరిగింది. ఈ సర్వే నంబర్‌లో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది. ప్రస్తుత గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ భర్త శ్రీనివాసరెడ్డికి ఇదెలా వచ్చింది? శ్రీనివాసరెడ్డి ఈ భూమిని మల్లారెడ్డి ఎడ్యుకేషనల్‌ ట్రస్టుకు బదలాయిస్తే.. వారు వర్సిటీ కోసం ప్రతిపాదించారు.

శ్రీనివాస్‌రెడ్డి ఆ భూమికి యజమాని ఎలా అయ్యా డో, వర్సిటీకి కేసీఆర్‌ ఎలా అనుమతిచ్చారో చెప్పాలి’ అని నిల దీశారు. ఇక జవహర్‌నగర్‌లోని 488 సర్వే నంబర్‌లోని 5 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉందని.. అది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు బోర్డు కూడా పెట్టారని చెప్పారు. అయినా ఆ భూమిని మల్లారెడ్డి కోడలు శాలినీరెడ్డి పేరిట రిజిస్టర్‌ చేశారని, అందులో మల్లారెడ్డి హాస్పిటల్‌ నడుపుతున్నారని, ఈ వివరాలు కేసీఆర్‌కు తెలియవా అని ప్రశ్నించారు. అలాగే మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రేడింగ్‌ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రతిపాదనలు పంపిందని న్యాక్‌ ఆక్షేపించిందని.. ఇదే ఇంజనీరింగ్‌ కళాశాలకు ప్రైవేట్‌ వర్సిటీగా సీఎం గుర్తింపు ఇచ్చారని విమర్శించారు. 

కేటీఆర్‌... గోవా ఎందుకు వెళ్లారో? 
తాను హైకోర్టులో పిటిషన్‌ వేయడం వల్లే సినీతారల డ్రగ్స్‌ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిందని రేవంత్‌ చెప్పారు. ‘నాలుగైదు రోజులుగా మంత్రి కేటీఆర్‌ ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన సహచరులు, సన్నిహితులపై ఆరోపణలు రావడంతో భయపడుతున్నారు. కేటీఆర్‌ ఎవరకీ చెప్పకుండా గోవా వెళ్లి వచ్చారా? లేదా?.. వెళితే అధికారికమా.. ప్రైవేటా.. చెప్పాలి’ అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల సన్నిహితుల పాత్ర లేకపోతే.. కేంద్ర విచారణ సంస్థలను ఎం దుకు తిరస్కరించారో చెప్పాలన్నారు. ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ఇంటెలిజెన్స్‌ డీజీ ప్రభాకర్‌రావును తప్పించడం, సైబరాబాద్‌ సీపీగా స్టీఫెన్‌ రవీంద్రను నియమించడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.  

దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రా..
తాను గెలిచిందే మల్లారెడ్డి అల్లుడి మీద అని.. ఇప్పుడు తాను రాజీనామా చేయాలని మల్లారెడ్డి డిమాండ్‌ చేయడం, దానిపై స్పందించాలని కేటీఆర్‌ అనడం హాస్యాస్పదమని రేవంత్‌ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్‌కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి. అది ఇబ్బందిగా ఉంటే గజ్వేల్‌లో రాజీనామా చేయాలి. నువ్వో.. నేనో.. తేల్చుకుం దాం. చంద్రబాబు ఎంగిలి మెతుకులు తిన్నది కేసీఆరే. అసలు కేటీఆర్‌ పేరే ఉద్దెర పేరు..’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ దత్తత ముసుగులో పేదోళ్ల కొంపలు కూల్చి తన ఫాంహౌస్‌కు 60 ఫీట్ల రోడ్లు వేయించుకున్నారని.. ఈ విషయాన్ని బయటపెడితే ఉన్మాదుల్లా విమర్శలు చేస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement