
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు మహిళలంటే అసలు గౌరవమే లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మహిళల పట్ల బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆమె తెలంగాణ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని, మహిళల్ని జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటనలున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులపై బీఆర్‌ఎస్ మహిళ నేతలు కనీసం మాట్లాడరని మండిపడ్డారు. గవర్నర్ తమిళి సైను సైతం అసభ్య పదజాలంతో దూషించారని, కేసీఆర్ సర్కార్‌ను నిలదీస్తే తనను నానా మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దూషణలు చేసిన వ్యక్తుల పేర్లతో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తననే కాదు.. ఓ ఐఏఎస్ మహిళా అధికారి చెయ్యి పట్టుకున్నారని, అలాంటి వారికి మహిళల మీద గౌరవం ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఇక్కడ న్యాయం జరక్కపోతే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment