సనత్‌నగర్ (హైదరాబాద్): ‘ప్రియాంకా గాంధీ సభలో డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. ఎమ్మెల్యే అని లేదు.. మంత్రి అని లేదు.. వాడు.. వీడు అని మాట్లాడతాడు.. ఉన్న పర్సనాలిటీ గింత.. పిసికితే ప్రాణం పోద్ది.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నడు..’ అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రస్థాయిలో దూషించారు.
ప్రియాంకా గాందీపై కూడా విమర్శలు కురిపించారు. ‘మా తాత ఇదుండే..మా అమ్మమ్మ అదుండే.. మా నాయన అది అని ప్రియాంకా గాంధీ చెబుతుంది. మరి 40 సంవత్సరాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని మీరే పరిపాలించారు కదా..పేద వాళ్ళకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని, 24 గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచన..మీకు ఎందుకు రాలేదు?..’అని నిలదీశారు. మంగళవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ధనియాలగుట్ట వైకుంఠ ధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసాని పాల్గొని మాట్లాడారు.
ఎక్కడైనా ఇళ్లు మునిగిన పరిస్థితి ఉందా?
‘వరదల ఇబ్బందులు గతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్ పాపం కాదా? ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలు, నాలాలు మూసుకుపోయిన పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ హయాంలో.. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గతంలో కంటే ఎక్కువగా వర్షాలు వచ్చాయి. ఎక్కడైనా ఇళ్లు మునిగిన పరిస్థితి ఉందా?..’అని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు వరదలు వస్తే ముఖ్యమంత్రి ఇంటికి పది వేల రూపాయలు చొప్పున ఇచ్చారని తెలిపారు.
నాకు బొట్టు పెట్టడం బీజేపీ వాళ్లు నేర్పిస్తారా?
‘ప్రైమ్ మినిస్టర్, వీళ్లు హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్‌యాదవ్‌కు కొత్తగా బొట్టు పెట్టడం నేర్పిస్తారా? నేను చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటున్నా. ప్రధానమంత్రి గానీ, దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానీ ఇక్కడి వైకుంఠధామం లాంటిది ఒక్కటైనా కట్టారా? ఎంతకూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలి.. వైషమ్యాలు, లేనిపోని సమస్యలు సృష్టించాలి. ఇదే పని.
జై హనుమాన్, జై బజరంగ్ అంటూ దేవుళ్ల పేర్లు చెప్పడమే తప్ప బీజేపీ నాయకులు ఎక్కడైనా ఒక్క దేవాలయం కట్టారా? అద్భుతమైన యాదాద్రిని నిర్మించిన కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా?. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది. కేసీఆర్ వచ్చాక నేను పోతాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అన్న పరిస్థితి రాష్ట్రంలో వ చ్చింది..’అని చెప్పారు.
ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి
‘చూస్తే అమెరికాలో వైట్‌హౌస్ చూడాలి..లేదా తెలంగాణలో సెక్రటేరియట్ చూడాలి. దేశంలోని నాయకులందరూ అంబేడ్కర్ పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవాలని చూస్తారు..కానీ నిజమైన నాయకుడు కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు..’అని తలసాని తెలిపారు. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాన్ని, నాయకులను కాపాడుకోవాలని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి..కొత్త బిచ్చగాళ్లు వస్తుంటారు..ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటారు..పనిచేయని వాడు మనకు అవసరం లేదు. ఎవరైతే మనకు పనిచేస్తారో వారి గురించే ఆలోచన చేయాలని తలసాని విజ్ఞప్తి చేశారు.
నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా: తలసాని
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదని, రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంతో వ్యవహరించాలని తలసాని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు.
రేవంత్ అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో తాను ఆవేదన చెందానని, ఆ ఆవేదన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను బాధ్యత కలిగిన మంత్రిగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదని, ఇకనైనా బాధ్యతగా మాట్లాడదామని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment