ఆ నియోజకవర్గంలో ఊసరవెల్లి భయపడే స్థాయి నేత ఒకరు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారనే భయం ఆయన్ను వెంటాడుతోంది. ఆ భయంతోనే పక్క చూపులు చూస్తున్నారు. అక్కడ పోటీ చేయడానికి పచ్చ పార్టీలో ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో అభ్యర్థిని ఎంపిక చేయడానికి కమిటీ వేయబోతున్నారట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నేత ఎవరో చూద్దాం.
విశాఖ నగరం నార్త్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. తమ పార్టీ ఓడిపోవడంతో..ఎమ్మెల్యేగా గెలిచినా గంటా గత నాలుగేళ్ళుగా ఇంటికే పరిమితమయ్యారు. తనను అసెంబ్లీకి ఎన్నుకున్న ప్రజలను పట్టించుకోవడం మానేశారు. అయితే తొలి నుంచీ ఊసరవెల్లి రాజకీయాలు చేసే గంటా శ్రీనివాసరావుకు ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీలోనే ఉండటం అలవాటు. కాని ప్రస్తుతం గతిలేక ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు. ప్రజలకు దూరం కావడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కేకే రాజునే కలుస్తున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందజేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి సక్రమంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం నార్త్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజురోజుకు బలపడుతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా నార్త్ నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో విశాఖ నార్త్ నియోజకవర్గం అంటేనే టీడీపీ నేతలు వణికి పోతున్నారు. టీడీపీ నేతలు అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నార్త్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వెల్లడయ్యింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3,500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. రోజు రోజుకీ వైఎస్ఆర్సీపీ బలపడుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా గంట మరో నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు.
గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం మారితే అక్కడ టీడీపీ పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశం మీద టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీలో ఎవరిని పోటీ చేయమన్నా విశాఖ నార్త్ అంటే భయపడి ముందుకు రావడంలేదు. దీంతో పక్క పార్టీల్లో పోటీచేయగలవారు ఎవరైనా ఉన్నారా అని టీడీపీ నేతలు వెతుకుతున్నారు. తనను గెలిపించిన నియోజకవర్గాన్ని గంటా పట్టించుకోకపోవడంతో నార్త్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఆ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడైనా ఎమ్మెల్యే లేని చోట, నియోజకవర్గ ఇన్‌చార్జిలేని చోట, త్రీ మెన్ కమిటీ అనేది ఏర్పాటు చేస్తుంటారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సెగ్మెంట్‌లో త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేస్తుండటం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతుంది.
మరోవైపు నార్త్ నియోజకవర్గం నుంచి గతంలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహించిన విష్ణుకుమార్ రాజు పరిస్థితి కూడా అలాగే ఉంది. విష్ణుకుమార్ రాజు నార్త్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిజెపిలో ఉంటే వైయస్సార్సీపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేమని గ్రహించిన విష్ణు కుమార్ రాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దయతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖ నార్త్‌లో పోటీ అంటేనే ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి ఏర్పడిందనే టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment