సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగిన ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. 6 గ్యారంటీల అమలుకు త్వరలో గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇదిరమ్మ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ కమిషన్ రద్దు చేసి, త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నారు.
చదవండి: కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత
రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఖరారు
కార్యవర్గ భేటీలో పార్టీ నేతలు 3 తీర్మానాలు ప్రవేశపెట్టారు. జనవరి 8,9 తేదీల్లొ పార్లమెంట్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. 11,12,13 తేదీల్లొ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ పర్యటన అనంతరం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు సీఎం రేవంత్.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని అన్నారు. బోర్లపడి బొక్కలు విరిగినా బీఆర్‌ఎస్‌కు బుద్ది రాలేదని విమర్శించారు. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.
చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్‌ఎస్ దోచుకుందని ధ్వజమెత్తారు రేవంత్. బీఆర్‌ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయాలని..12కు తగ్గకుండా సీట్లను గెలిపించుకోవాలని తెలిపారు. ఈ నెల 8న 5 జిల్లాలు.. 9న 5 జిల్లాల నేతలతో సమీక్షించనున్నట్లు చెప్పారు . 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు.
‘బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు.
కార్యవర్గ భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్ద కాలం తర్వాత మనకు వచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు. అనేక కష్టనష్టాలను భరించి అధికారంలోకి వచ్చామన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పారు. ప్రజలకు మనం ఇచ్చిన హామీలపై విశ్వాసంతో కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేశారని భట్టి మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలని, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. ఇతర మంత్రులు మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. తలతాకట్టు పెట్టైనా 6 గ్యారంటీలు అమలు చేస్తాం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment