
సాక్షి, హైదరాబాద్/ కవాడిగూడ: కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ గజదొంగలేనని, పేదల అభ్యున్నతి కోసం పాటుపడతామని అధికారంలోకి వచ్చిన వీరు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారి ఫొటోలు పోలీస్ స్టేషన్‌లలో పెడుతున్నారని, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుతింటున్న ఈ ఇద్దరి ఫొటోలను పెట్రోల్ బంకుల వద్ద పెట్టాలని ఎద్దేవాచేశారు. పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాచౌక్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. మలేసియాలో రూ.37, మయన్మార్‌లో రూ.39, పాకిస్తాన్‌లో రూ.53, రష్యాలో రూ.50, ఇండోనేసియాలో రూ.54 చొప్పున లీటర్ పెట్రోల్ ధర ఉంటే మన దేశంలో మాత్రం రూ.105 అమ్ముతున్నారని మండిపడ్డారు. రూ.40కే రవాణా అవుతున్న పెట్రోల్‌పై మోదీ, కేసీఆర్ కలిసి రూ.66 పన్నులు వేసి పేదలను దోచుకుంటున్నారన్నారు.
ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వీరిద్దరికి బుద్ధి చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఇలాంటి వారిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హోంగార్డులను పెట్టి అరెస్టు చేయిస్తామని వ్యాఖ్యానిం చారు. సీఎం కేసీఆర్ రెండేళ్లే అధికారంలో ఉంటారని, ఆ తర్వాత వచ్చేది సోనియా రాజ్యమేనన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని పోలీసులతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
తోపులాటలు.. ఉద్రిక్తత
సభ అనంతరం ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా, గవర్నర్ తమిళిసై అందుబాటులో లేకపోవడం తో ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో రేవంత్‌రెడ్డి బయలుదేరారు. అయితే, ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు రహదారులను దిగ్బంధనం చేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడంతో అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ బారికేడ్లు దూకేందుకు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను భుజాలపై ఎక్కించుకుని బారికేడ్లు దాటించడంతో ఇందిరా పార్కు చౌరస్తా వరకు వెళ్లారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఉన్న పోలీసులు ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేతలు మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌లతోపాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment