నాగర్ కర్నూల్ వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలో పోడు భూముల సమస్య అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతోంది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన నాగం జనార్థనరెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. తెలుగుదేశం అంతర్థానం తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ గుర్తింపు దక్కకపోవడంతో ప్రస్తుతం హస్తం పార్టీలో కాలం వెళ్ళదీస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మర్రి జనార్థనరెడ్డి కారు గుర్తు మీద ఇక్కడి నుంచి విజయం సాధించారు.
వచ్చే ఎన్నికల్లో కూడా మర్రి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జిల్లా పర్యటకు వచ్చినపుడు బహిరంగంగానే మర్రి పోటీ గురించి ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ళ దామోదరరెడ్డితో మర్రి జనార్థనరెడ్డికి అసలు పడదనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. నియోజకవర్గంలో తన కేడర్‌పై కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదరరెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డిపై మీడియా ముందే తీవ్ర ఆరోపణలు చేశారు. కూచుకుళ్ళ రెండోసారి కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ కుమారుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డి ఈసారి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు.
నాగం జనార్థనరెడ్డి వయస్సు మీదపడటం, కాంగ్రెస్ కేడర్‌లో చాలామంది టీఆర్‌ఎస్ గూటికి చేరడంతో ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో సీటు రాకపోతే కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగం, కూచుకుళ్ళ మధ్య సయోధ్య కుదిరితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాగంకు సముచిత స్థానం ఇస్తామని పెద్దల నుంచి హామీ వస్తే నియోజకవర్గంలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారవచ్చు. కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతాయని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.
అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ సీటుగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించిన గువ్వల బాలరాజ్ మూడోసారి కూడా పోటీ చేస్తారని తెలుస్తోంది. బాలరాజ్ వ్యవహారశైలి కారణంగా కేడర్‌లో, ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేస్తున్నదేమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఆమ్రాబాద్‌లో మంచినీటి సమస్య, పోడు భూముల సమస్య ఏమాత్రం పరిష్కారం కాకపోవడంతో గిరిజనులు కూడా ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేలో కూడా బాలరాజ్‌కు నెగిటివ్ నివేదికే వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డాక్టర్ వంశీకృష్ణ నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన కేడర్ తిరిగి వస్తుండటంతో తమ విజయం తథ్యమని హస్తం పార్టీ భావిస్తోంది.
డాక్టర్ వంశీకృష్ణ భార్య ఆమ్రాబాద్ జడ్‌పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనూరాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈసారి బీజేపీ కూడా అచ్చంపేటలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇటీవల కర్నాటక డీజీపీగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్‌తో బీజేపీ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి మహేంద్రనాథ్ కుమారుడైన రవీంద్రనాథ్ అయితే మాదిగ సామాజిక వర్గం ఓట్లన్నీ కమలం గుర్తుకే పడతాయని ఆ పార్టీ భావిస్తోంది.
కల్వకుర్తిలో అధికార పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య అంతర్గత పోరు సాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వీరిద్దరి మధ్య రెండు వర్గాలుగా చీలిపోయారు. గత ఎన్నికల్లో జైపాల్‌కు కసిరెడ్డి సహకరించకపోయినా విజయం సాధించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా గ్యాప్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్యా సయోధ్యకు పార్టీ నాయకత్వం కూడా ప్రయత్నించలేదు.
వంశీచందర్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించి..ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమి చెందారు. రెండున్నరేళ్ళుగా వంశీచందర్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. మరోవైపు తలకొండపల్లి జడ్‌పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్ కాంగ్రెస్‌లోకి చేరేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. కాని సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్లు తెలిసింది.
బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేస్తోంది. గత రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిన తల్లోజు ఆచారినే ఈసారి కూడా బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది.
కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జూపల్లి ఓటమి చెందారు. తర్వాత హర్షవర్థన్ కారు పార్టీలోకి జంప్ చేశారు.
ఇక అప్పటినుంచీ ఇద్దరి మధ్యా వార్ నడుస్తోంది. ఇద్దరి వర్గీయులు ఎవరికి వారు ఈసారి సీటు తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే జూపల్లి పార్టీ మారతాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ మారితే పాతగూడు కాంగ్రెస్‌లో చేరతారా? లేక కాషాయ జెండా పట్టుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు జగదీశ్వరరావు ఆసక్తి చూపిస్తున్నారు. హర్షవర్థన్‌రెడ్డి పార్టీ వీడాక కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం కరువైంది.
Comments
Please login to add a commentAdd a comment