సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలను ఏకగ్రీవంగా దక్కించుకున్న టీఆర్‌ఎస్.. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసింది. రిజర్వేషన్‌స్థానాల్లోనే గాక రిజర్వేషన్‌వర్తించని చోట్ల కూడా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 14 పదవుల్లో పదింటిని వారికే ఇచ్చి అగ్రతాంబూలం వేసింది. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీలకు గత నెల 30న పోలింగ్‌జరగ్గా.. ఈ నెల 3న ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. వీటిలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించింది. స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఈ పదవులన్నింటినీ టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.
కార్పొరేషన్లలో..
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లుగా మహిళలకే టీఆర్‌ఎస్‌ప్రాధాన్యం ఇచ్చింది. వరంగల్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వు అయినా.. ఇక్కడ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళ, మాజీ ఎంపీ గుండు సుధారాణికి అవకాశం లభించింది. ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వుకాగా.. కమ్మ సామాజికవర్గానికి చెందిన నీరజను అధిష్టానం ఎంపిక చేసింది. రెండు కార్పొరేషన్లలోనూ ఎలాంటి రిజర్వేషన్ వర్తించని డిప్యూటీ మేయర్‌పదవులను మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఇచ్చింది. వరంగల్‌లో 36వ డివిజన్ నుంచి ఎన్నికైన రిజ్వానా షమీమ్, ఖమ్మంలో 37వ డివిజన్ నుంచి గెలిచిన షేక్ ఫాతిమా జోహ్రాకు పదవి దక్కింది.
మున్సిపాలిటీల్లోనూ మహిళలకే..
సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల్లోనూ టీఆర్‌ఎస్ మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. జడ్చర్ల మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు రెండూ మహిళలకు దక్కాయి. అచ్చంపేట, నకిరేకల్‌లో వైస్ చైర్‌పర్సన్ పదవులకు మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు మున్సిపాలిటీల్లో ముగ్గురు చైర్‌పర్సన్లుగా, ముగ్గురు వైస్ చైర్ పర్సన్లుగా పీఠం అధిష్టించారు.
ఎంపికలో ఎమ్మెల్యేలకే స్వేచ్ఛ
63 మంది కార్పొరేటర్లు ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటంతో మేయర్ అభ్యర్థి పేరును టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నామినేషన్ల సమయంలోనే ఎంపీ గుండు సుధారాణికి అవకాశమిస్తామని కేసీఆర్ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆమెను ఎంపిక చేశారు. వరంగల్ మినహా ఖమ్మం, ఐదు మున్సిపాలిటీల్లో పదవుల ఎంపికలో పార్టీ స్థానిక ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్వేచ్చనిచ్చారు. పరిశీలకులు సీల్డ్ కవర్లలో పేర్లను తీసుకెళ్లినా ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ఎంపకి జరిగినట్టు జాబితా స్పష్టం చేస్తోంది. మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదన మేరకు.. సిద్దిపేట మున్పిపల్ చైర్మన్‌గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన కడవేర్గు రాజనర్సు భార్య మంజుల తాజాగా చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ బాలరాజు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నకిరేకల్‌లో ఎమ్మెల్యే లింగయ్య, షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రతిపాదించిన వారికే పదవులు దక్కాయి. ఖమ్మంలోనూ మంత్రి పువ్వాడ అజయ్ ప్రతిపాదన మేరకే నీరజకు మేయర్‌గా అవకాశం దక్కినట్టు తెలిసింది.
అన్ని జాగ్రత్తల మధ్య ఎన్నిక
రెండు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ పదవులకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నిక నిర్వహించారు. అన్ని పదవులు టీఆర్‌ఎస్‌కు దక్కడం ఖాయమవడంతో పార్టీ పరిశీలకులుగా వెళ్లిన మంత్రులు, ఇతర టీఆర్‌ఎస్ నేతలు.. ముందుగానే పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. ఎన్నిక జరిగే తీరును వివరించడంతోపాటు పార్టీ ఖరారు చేసిన వారినే ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల కోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరిగిన ప్రత్యేక సమావేశాలకు.. కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమే సమావేశ మందిరంలోకి అనుమతించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు అందజేశారు. రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే విజయోత్సవ ర్యాలీలు, పూల దండలు, షాలువాలు, బొకేలపై అధికారులు నిషేధం విధించారు.
వీడియో కాల్ 17 మంది ద్వారా ప్రమాణ స్వీకారం
ఎన్నికల తర్వాత కోవిడ్ బారినపడిన 17 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీడియా కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ ఎన్నికలోనూ వారు వీడియో కాల్ ద్వారా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఒక్క వరంగల్ కార్పొరేషన్‌లోనే గెలిచిన 48 మంది టీఆర్‌ఎస్ కార్పొరేటర్లలో.. కరోనా బారినపడ్డ ఎనిమిది మంది వీడియో కాల్ ద్వారానే ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం.
కార్పొరేషన్/మున్సిపాలిటీ మేయర్/చైర్మన్ డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్
వరంగల్ (బీసీ జనరల్) గుండు సుధారాణి రిజ్వానా షమీమ్
ఖమ్మం (జనల్ మహిళ) పొనుకొల్లు నీరజ షేక్ ఫాతిమా జోహ్రా
సిద్దిపేట (జనరల్ మహిళ) కడవేర్గు మంజుల జంగిటి కనకరాజు
జడ్చర్ల (బీసీ మహిళ) దొరపల్లి లక్ష్మి పాలాది సారిక
నకిరేకల్ (బీసీ జనరల్) రాచకొండ శ్రీనివాస్ ఎం.ఉమారాణి
అచ్చంపేట (జనరల్) ఎడ్ల నర్సింహగౌడ్ పోరెడ్డి శైలజ
కొత్తూరు (జనరల్ మహిళ) బి.లావణ్య డోలి రవీందర్
నంబర్ వన్ చేస్తా..
కార్పొరేటర్ల అందరి సహకారంతో ఖమ్మం కార్పొరేషన్‌ను నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తా. ఏ సమస్య వచ్చినా కార్పొరేటర్లు నన్ను సంప్రదించవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటూ వారి డివిజన్లకు కావాల్సిన పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యతనిస్తా.
– ఖమ్మం మేయర్ నీరజ
రాజకీయ పునర్జన్మ..
బీసీ జనరల్ స్థానంలో మహిళనైన నాకు అవకాశమిచ్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజకీయ పునర్జన్మ ఇచ్చారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరంగల్ అభివృద్ధికి పాటుపడతా. కేటీఆర్‌కు వరంగల్‌పై ప్రత్యేక విజన్ ఉంది భవిష్యత్ తరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తా.
– వరంగల్ మేయర్ సుధారాణి
చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’
చదవండి: తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..?
వరంగల్, ఖమ్మం మేయర్లు వీరే..
Comments
Please login to add a commentAdd a comment