బీజేపీకి మిగతా పార్టీకి ఉన్న తేడా అదే: కిషన్‌రెడ్డి | TS BJP Chief Kishan Reddy Comments Over Elections | Sakshi
Sakshi News home page

హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా?: కిషన్‌రెడ్డి

Published Fri, Nov 24 2023 7:28 PM | Last Updated on Sat, Nov 25 2023 8:59 AM

TS BJP Chief Kishan Reddy Comments Over Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకుంటూనే ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఇక, ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురబోతుందని గట్టిగానే సౌండ్‌ వినిపించారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్‌ఎచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో సైతం బీజేపీ.. తెలంగాణ ప్రజలకు కీలక హామీలను సైతం ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా బీజేపీ  జాతీయ నేతల నుంచి స్థానిక నేతల వరకు ప్రచారంలో దూకుడు పెంచారు. 

ఈ క్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో  క్లారిటీ ఇచ్చారు..

జోడు పదవులకు న్యాయం జరుగుతోందా?
►నేను పదవిలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం, జాతీయ స్థాయితో సమన్వయంతో కేడర్‌ స్థాయిలో కార్యకర్తగా నేను పూర్తి స్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. 

బీజేపీ టెంపో డౌన్‌ అయ్యిందా?
►ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు ధీటుగానే బీజేపీ బలంగా ఉంది. మాకు వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ మా దగ్గర ఉంది. 

కిషన్‌రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్‌ఎస్‌కా?
►రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్‌ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడి అయిన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండు సార్లు నన్ను అరెస్ట్‌ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలు. ఎక్కడ కూడా బీఆర్‌ఎస్‌కు తగ్గలేదు. గతంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పనిచేశాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ.. కాంగ్రెస్‌ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ ఒక్కటే. కానీ, మజ్లిస్‌ పార్టీలో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లీస్‌ వంటి పార్టీతో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం.

తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్‌ ఉందా?
►కర్టాటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. వేల కోట్లను మీడియా మేనేజ్‌మెంట్‌, సోషల్‌ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. 

అంబర్‌పేట నుంచి ఎందుకు పోటీలో లేరు?
►నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్‌ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్థత ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే నేను పోటీలో లేను. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. క్లారిటీ కోసమే నాకు టికెట్‌ ఇవ్వలేదు. 

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలపై స్పందనేంటి? 
►బీజేపీ బాధ్యత కలిగిన పార్టీ. మేము ఓట్ల కోసం ఎన్నికల్లో హామీ ఇవ్వం. మాట ఇచ్చాక కష్టమైనా, సుఖమైనా ఆ మాట కోసం నిలబడతాం. 
ఉదాహరణకు ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని రద్దు చేసిన ఘనత మాది. దీంతో, మోదీ పట్ల ముస్లింల్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. 

4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా?
►ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింల్లో కొందరికి బీసీ-డీలో రిజర్వేషన్‌ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్‌ ఇస్తునామో అందులో ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్‌ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్‌ కూడా వ్యతిరేకించారు. 

కర్ణాటకలో గతంలో పరిపాలనలో ఉన్నారు.. అక్కడ అన్న, అక్షర, ఆదాయ, అభివృద్ధి, అభయ అనే ఒక కాంక్రీట్‌ ఎజెండా ఏదైతే ఉందో,, అది తెలంగాణలో పెట్టడంలో కొంచెం వెనుకబడ్డారా?
►మేము తెలంగాణలో కచ్చితంగా ఏదైతే అమలు చేయగలమో అదే చేస్తున్నాం..  ఓట్ల కోసం పోటీ పడి ప్రజలను మభ్య పెట్టి, ప్రజలను మోసం చేసి ఆచరణ సాధ్యంకానటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.. ఆ రకంగా మేము ఇవ్వం. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏదైతే చేయాలో అదే చేస్తున్నాం.  ఏ రకమైన హామీలు ఇచ్చినా కూడా ప్రొడెక్టివిటీ అనేది ఉండాలి. వెల్పేర్‌ యాక్టివిటీలో ప్రొడెక్టివిటీ ఉండాలి.. డెవలప్‌మెంట్‌ యాక్టివిటీలో ప్రొడెక్టివిటీ ఉండాలి. స్టేట్‌ ఇంట్రె‍స్ట్‌లో కూడా ప్రొడెక్టివిటీ ఉండాలి. దాని ఆధారంగానే మా యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందించాం. అది వ్యవయసాయ రంగం కావొచ్చు.. వెల్ఫెర్‌ రంగం కావొచ్చు.. నిరుద్యోగ యువతకు సంబంధించింది కావొచ్చు.. అర్బన్‌ ఏరియా డెవలప్‌మెంట్‌కు సంబంధించినది కావొచ్చు. కరెప్షన్‌ కావొచ్చు.. ఇతర సామాజిక అంశాలు కావొచ్చు.. ఇతర అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మాయొక్క సమగ్రమైనటువంటి ఎన్నికల ప్రణాళిక రూపొందించాం..భారతీయ రియలిస్టిక్‌ ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక్క భారతీయ జనతాపార్టీదే.


గట్టిగా మీరు చెబుతున్నారు.. బీజేపీ అధికారంలోకి వస్తుందని, కొంతమంది హంగ్‌ వస్తే బీజేపీ కింగ్‌ మేకర్‌ రోల్‌ పోషిస్తుందని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు.. కిషన్‌రెడ్డి గారి మద్దతు ఎవరికి ఉంటుంది?
►నా మద్దతు పార్టీకి ఉంటుంది(నవ్వుతూ), ప్రజాస్వామ్య పద్దతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్ధుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యానాథ్‌ను కూడా తర్వాతే ఎంపిక చేశాం.. ముందుగా సీఎం అభ్యర్ధి ఎవరు అనేది నిర్ణయించలేదు. ఆయన చాలా అద్భుతమైన పరిపాలన చేశారు.

ముందు ఆయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతీ విషయంలోనే ముద్రవేశారు.. కరెప్షన్‌ కావొచ్చు.. లా అండ్‌ ఆర్డర్‌ విషయం కావొచ్చు అడ్మినిస్ట్రేషన్‌ కావొచ్చు. మొత్తంగా యూపీ ముఖ చిత్రాన్నే మార్చి వేశారు. 75 ఏళ్లలో మారని యూపీ ముఖచిత్రాన్ని ఆయన ఈ ఐదేళ్లలో మార్చేశారు.

యూపీకి మొదటిసారి ఇన్వెస్టిమెంట్స్‌ వస్తున్నాయి.. స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి చూస్తే యూపీకి ఇన్వెస్టిమెంట్స్‌ రాలేదు. ఆదిత్యానాథ్‌ సీఎం అయిన తర్వాత ఆ పరిస్థితి మారింది. మొత్తం అక్కడ మాపియా రాజ్యం ఉంటుంది. అనేక రకాల గ్యాంగ్‌లు ఉండేవి. అటువంటి యూపీని మొత్తంగా మార్చారు. కాబట్టి ఏ ముఖ్యమంత్రిని భారతీయ జనతాపార్టీ ఇచ్చినా కూడా అది ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి ఉంటాడు. రాజశేఖర్‌రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా నేను వారికి దగ్గరకు వెళ్లేవాడిని. ప్రజా సంఘాలను తీసుకుని రిప్రంజటేషన్‌ ఇవ్వడానికి వెళ్లేవాళ్లం.. అలా అక్కడా అనేక సంఘాలతో కలిసే వాళ్లం. మరి ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రితో ఎవరైనా కలుస్తారా?

మీరు చెప్పిన దాంట్లో రెండు అంశాలు.. ఒకటి యోగి ఆదిత్యానాథ్‌, మోదీ పేర్లు చెవులు బ్రద్ధలు అయ్యేలా వినబడతాయి..మరి తెలంగాణలో  కిషన్‌రెడ్డిగారి పేరు ఎందుకు వినబడదు.. మీరు కేంద్రమంత్రిగా ఉన్నారు కాదనడం లేదు.. కానీ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి?
►ఎవరు పని వాళ్లు చేస్తాం మేము. నేను ఇక్కడకు వచ్చి సుమారు మూడు నెలలు అవుతోంది. డెడికేషన్‌తోటి పని చేస్తున్నాను. ఎందుకంటే దేశం కోసం పని చేయడానికి అందరికీ అవకాశం రాదు. అదృష్టవశాత్తూ నాకు అవకాశం ఇచ్చారు.  నేను వెళ్లిన సమయంలోనే అనేక సమస్యలు.. రామజన్మభూమి సమస్య, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌, ఆర్టికల్‌ 370 తర్వాత నన్ను జమ్మూకశ్మీర్‌లో పరిశీలకుడిగా వేశారు. దాంతో ఎక్కువ సమయంలో అక్కడే ఉన్నాను.. ఎల్లప్పుడూ  ఎమ్మెల్యేలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను.. కానీ అక్కడ కూడా చేయాల్సి రావడంతో కాస్త ఎక్కువ సమయం అక్కడ ఇచ్చాననే మాట వాస్తవమే.

అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి రీజినల్‌గా ఈ అంశాలన్నీ కూడా దేశానికి సంబంధించినవి,, రాష్ట్రాలకి  సంబంధించినవి కాదు అనే నెరిటివ్‌ బిల్డ్‌ అవుతున్న క్రమం,ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికి మోదీగారిని బలపరుస్తున్నారు కదా.. ఎక్కడ ఫెయిల్యూర్‌ అంటారు?
►మేము ఎక్కడా ఫెయిల్యూర్‌ కాదు..  అసలు తెలంగాణలో  ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పార్టీ ఏది అని అడుగుతున్నాను. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు ఎక్కడైనా పోరాటం చేశారా?, మేము అనేక రకాల సమస్యల మీద పోరాటం చేశాము. నేను వచ్చిన రెండు మూడునెలల్లోనే నేను కూడా పోరాటం చేశాను. మేము చేస్తున్నది ప్రజల్లోకి తీసుకువెళ్లడం కాస్త వైఫల్యం చెందాము. ఎందుకంటే మాకు మీడియా సపోర్ట్‌ లేదు. మరి కాంగ్రెస్‌ ఏం చేసిందని ఇంత పాపులారిటీ వస్తుంది చెప్పండి. కాంగ్రెస్‌ పార్టీ గత 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పండి.. అన్ని వైఫల్యాలే..  టీఆర్‌ఎస్‌తో కలిసిన పార్టీనే కాంగ్రెస్‌. కేంద్రంలో  ఫ్రంట్‌ వస్తే నేను  చేరతానని కేటీఆర్‌ స్వయంగా చెప్పాడు

తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేసిందనే సాధారణ ఓటర్‌కు వచ్చే ప్రశ్న?
►అన్ని రకాలుగా చేశాం . తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏం చేయలేదో చెప్పండి.. అన్ని రకాలుగా చేశాం. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక వితండ వాదము.. మొండి వాదము. బట్టకాల్చి ముఖం మీద వేసే విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహరిస్తోంది. కేసీఆర్‌ కుటుంబం అబద్ధాలకు మారుపేరు. మాటల గారడీకి మారుపేరు. ప్రజల్ని మభ్యపెట్టడంలో వారిని మించిన ఘనుడు లేడు. ఒకటి మాత్రం చెబుతున్నాను.. ఎన్నికల తర్వాత, పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చే సమయానికి ఇదే టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌లు ఒక్కటవుతాయి. ఎవరు వద్దన్నా కాకున్నా వాళ్లు ఒక్కటే.. వారి డీఎన్‌ఏ ఒక్కటే.. ఒకే కవల పిల్లలు వాళ్లు.. నరేంద్ర మోదీని ఓడించడం కోసం కాంగ్రెస్‌ పార్టీతో కలవబోతున్నానను అని కేసీఆర్‌ చెబుతాడు. 

అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అవును.. మేము నరేంద్ర మోదీని గద్దె దించడం కోసం కలుస్తున్నాం అని చెబుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశాన్ని ఉద్దరించడం కోసం, దేశాన్ని దోచుకోవడం కోసం, కుటుంబ పాలనను మళ్లీ తెలంగాణ ప్రజలపై రుద్దడం కోసం టీఆర్‌ఎస్‌తో కలుస్తున్నాం అని చెబుతారు..

మీడియా సపోర్ట్‌ చేయడం లేదని చెబుతున్న మీరు.. నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో ఉందంటున్నారు.. మరి అది ఏరకంగా అవుతుంది?
►నిశ్శబ్ద విప్లవం అనేది సోషల్‌ మీడియా ద్వారా వచ్చింది.. ఈరోజు యూత్‌ టీవీలు చూసే పరిస్థితి లేదు. పేపర్లు చదివే పరిస్థితి అంతకన్నా లేదు. మేము రోడ్ల మీద పాదయాత్ర చేస్తుంటే వాళ్ల వాళ్ల ఒరండాల మీద యూత్‌ కూర్చుంటారు. మేము డబ్బులతో సందడి చేస్తూ ఊరేగింపుగా వెళ్లి ఇంటికి కరపత్రాలు ఇస్తే వాళ్ల నాన్ననో, అమ్మనో కరపత్రం తీసుకుంటారు.. కానీ ఇంటి ముందు కూర్చొన్న యూత్‌ చేతిలో సెల్‌ఫోన్‌ పెట్టుకునే కూర్చొంటాడు. ఊరేగింపుగా వచ్చారు.. ఎవరో వచ్చారు అని తలెత్తి పరిస్థితి లేదు ఈరోజు. కరపత్రం యూత్‌ ముందు పడేసినా తలతిప్పి కూడా చూడడు..

ఈ పరిస్థితికి కారణం ఏమంటారు?
►ఇది కేవలం తెలంగాణకో, దేశానికో పరిమితం కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉంది. చైతన్యం తీసుకురావాలి. దీంతో మంచి ఉంది చెడూ ఉంది. ఆయనకు నచ్చిన విషయాలు ఉంటే స్పందిస్తున్నాడు.. కామెంట్స్‌ చేస్తున్నాడు. గతంలో మీలాంటి వాళ్లు చెబితేనే ప్రజలకు తెలిసేది. ఇప్పుడు యువకుడు కూడా తనకున్న అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేసే అవకాశం సోషల్‌ మీడియా ద్వారా వచ్చింది. గతంలో ఈ అవకాశం లేదు.

తెలంగాణ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు?
►అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది

రాజకీయాల్లో అటు ఇటు కావడం అనే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది కదా.. అలాంటి పరిస్థితి వస్తే..?
►ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, 

ఒకవేళ బీజేపీకి సరిపడినన్ని సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా?
►బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది

తెలంగాణలో ఏం మార్పు జరిగినా గట్టి సౌండ్ వస్తుందంటారు,  అది విభజన కావచ్చు, ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కావచ్చు?
►అలాంటి పరిస్థితి లేదనుకుంటున్నాం గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్‌ఎస్‌ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు.  మేం కూడా అనుకోలేదు. కచ్చితంగా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని మేం భావిస్తున్నాం.

ఎందుకంటే హైదరాబాద్‌లో అసలు కాంగ్రెస్ పార్టీ అన్నదే లేదు. అలాగే బీఆర్ఎస్ మీద పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉంది. జిల్లాలనే చూసుకుంటే అదిలాబాదులో బీఆర్ఎస్ లేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ లేదు అదే సమయంలో బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్‌గా లేదు, పైగా బీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండు జిల్లాల్లో బలముందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో ఉంది కానీ వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం.. మరికొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాం. బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని కచ్చితమైన ధీమాతో ఉన్నాం. కొందరు బీజేపీకి ఒకటి రెండు సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ తలకిందులయ్యేలా మంచి ఫలితాలను పార్టీ సాధిస్తుంది. 

దేని ఆధారంగా చెబుతున్నారు?
►దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. 

 ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి కుటుంబాలను పట్టించుకునే పార్టీ లేదన్న ప్రచారం ఉంది?
►దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పేదల గురించి మధ్యతరగతి ప్రజల గురించి మాట్లాడుతుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ప్రత్యేకంగా EWS రిజర్వేషన్లను బిజెపి తెచ్చింది. మా పరిశీలనలో మధ్యతరగతి కుటుంబాలు ఎప్పుడు సమాజం గురించి ఆలోచిస్తాయి. తమ ఆకాంక్షల కంటే దేశం గురించి ఆలోచిస్తారు. పైన ఉండే వాళ్లకు కింద ఉండే వాళ్లకు కొంత స్వార్థం ఉండొచ్చు కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం దేశం కోసమే ఆలోచిస్తారు. ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఒక కుటుంబం మోచేతి నీళ్లు తాగాలా? ఒక కుటుంబం కుటుంబానికి బానిసగా ఉండాలా? వాళ్ల పెత్తనానికి లోబడి ఉండాలా? మేము పోరాటం చేసింది ఇదేనా? 

మేం తెచ్చుకున్న తెలంగాణ ఒక తండ్రి కూతురు కొడుకు చేసే పెతనం కోసమేనా? అని ఆలోచిస్తున్నారు. ఎన్ని పథకాలు తెచ్చినా.. ఎంత సంక్షేమం చేసినా ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు వంచించలేరు, ప్రజల హృదయాల్లో ఉన్న మేనిఫెస్టోను మార్చలేరు. ఒక ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తికి అద్భుతమైన బిల్డింగ్ కట్టించి పంచభక్ష పరమాన్నాలు పెట్టించి, అన్ని రకాలైన విలాసాలు చేకూర్చి ఒక కండిషన్ పెడితే... ఎలాంటి కండిషన్ అంటే బయటకు తీసుకొచ్చి ఒక చెప్పు దెబ్బ కొడతా అంటే ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి

బీజేపీ ఎప్పుడూ ఒక మాట చెప్తుంది దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిడ్యువల్‌ లాస్ట్, ఇలాంటి విధానం వల్ల పార్టీని అభిమానించే వాళ్ళు కూడా కొందరు దూరం అవుతారు అన్న వాదన ఉంది?
►దేశం ఫస్ట్ అని అనుకున్న ఏ ఒక్కరు కూడా మా నుంచి దూరం కాలేరు

మరి ఇన్నాళ్లు మీతో పని చేసిన వివేక్ కావచ్చు లేదా విజయశాంతి కావచ్చు లేదా ఇంకొందరు కావచ్చు ఎందుకు పార్టీకి దూరమయ్యారు?
►వివేక్ ఎప్పుడు వచ్చారు?  పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు వచ్చారు?  8 నెలల కింద వచ్చారు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిందో అప్పుడు వీళ్లంతా పార్టీని విడిచి వెళ్లిపోయారు. వాళ్లకు ఒక బీసీ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదేమో..! బీజేపీ ఉన్నది వ్యక్తుల కోసం కాదు దేశం కోసం, కొందరి అధికారం కోసం పార్టీ పనిచేయదు. బీజేపీ నుంచి నాయకులు వెళ్లిపోవచ్చు కానీ.. వారి వెంట ఏ ఒక్క కార్యకర్త కూడా వెళ్లిపోడు. అది బీజేపీకి ఉన్న విశ్వసనీయత. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వాళ్ళు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.. వాళ్లకు విలువలు లేకపోవచ్చు కానీ బీజేపీకి మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వారందరికి ప్రజలే తమ ఓటుతో సమాధానమిస్తారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక్‌సభలో రెండు సీట్లు ఉండేవి. ఇప్పుడు 300కు పైగా ఎంపీలు లోక్‌సభలో బీజేపీకి ఉన్నారు. 

తెలంగాణలో ఏమాత్రం ఉనికి లేని పవన్ కళ్యాణ్‌తో కలిసి వెళ్తున్నారు అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది?
►పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ. 2014, 2018, 2021లలో జరిగిన అన్ని ఎన్నికల్లో మాతో పాటు ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ 72 చోట్ల నామినేషన్ వేసినా సరే మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత ఉపసంహరించుకుంది. 2018 అలాగే అంతకుముందు 2014లో కూడా బీజేపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశాడు. ఎప్పటినుంచో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మాతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. మా భాగస్వామ్య పార్టీని కలుపుకొని పోవాలన్న ఉద్దేశ్యమే తప్ప దీని వెనుక ఎలాంటి ఎజెండా మాకు లేదు

బీఆర్ఎస్ లౌకిక రాజ్యం అంటున్నారు, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? దీంట్లో కూడా మతాన్ని ఆపాదిస్తున్నారు దీనిపై బీజేపీ స్టాండ్ ఏమిటి? 
►ఈ విషయంలో మా పార్టీ భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మేము హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీయా? వాళ్లేమో మరో మతం గురించి మాట్లాడితే సెక్యులర్ పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్ గా ఉంటుంది. హిందువులు మైనార్టీ లోకి వెళ్ళినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు.  నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడదాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్‌ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్ళకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. 

మతపరంగా పూలరైజేషన్ ఇలాగే కొనసాగుతుందా? 
►ఎక్కడుందండి పోలరైజేషన్?  మేం ప్రశ్నించే అంశాలేంటీ? రైతుల గురించి మాట్లాడుతున్నాం.  ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్నాం. కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నాం. మా ఎజెండాలో ఉన్న ఒక్క అంశం చెప్పండి మతపరంగా ఇలా చేస్తున్నామని..?

కేరళ స్టోరీ అన్న ఎజెండా కర్ణాటకలో ఫ్లాప్ అయింది. తెలంగాణలో స్టోరీ మాత్రమే నెగ్గుతుందని విమర్శలు వస్తున్నాయి కదా.?
►తెలంగాణలో మేమేం స్టోరీ తీసుకొచ్చాం? ఒక కుటుంబ పాలన గురించి మాట్లాడటం తప్ప. మజ్లిస్‌ పార్టీతో మీరు స్నేహం చేసినప్పుడు రజాకార్ల గురించి మాట్లాడకుండా ఇంకేం మాట్లాడతాం? అసలు మజ్లిస్‌ పార్టీ పెట్టింది ఎవరు?  స్థాపించింది ఎవరు?  కాశీం రిజ్వీ ఎవరు? స్వాతంత్రం రాగానే పాకిస్తాన్ పారిపోయిన వ్యక్తి ఖాసీం రిజ్వీ. అతడి వారసత్వంగా మజ్లిస్‌ పార్టీ కొనసాగుతుంటే మేమెందుకు మాట్లాడకూడదు?  కచ్చితంగా ప్రశ్నిస్తాం. చరిత్ర చెప్పిన సత్యం ఇది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణలో మాత్రం 13 నెలల పాటు కనీసం వందేమాతరం నినాదం చేయనివ్వకుండా,  తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా.. నిజాం సైనికులు, రజాకార్లు తెలంగాణలోని పల్లెల మీద పడి వేలాది మందిని హత్యాకాండ కొనసాగించి, హింసకాండ కొనసాగించి, హిందూ స్త్రీలను వివస్త్రలను  చేసి బతుకమ్మ లాడించి, సంపద దోచుకుని మేము పాకిస్తాన్ తో కలుస్తాం తప్ప భారత దేశంలో విలీనం కాబోమని చెప్పి సర్వసత్తాక దేశంగా ఉంటామని చెప్పుకున్న పార్టీ గురించి ప్రశ్నిస్తే తప్పేంటి? మళ్లీ మళ్లీ చెబుతున్నాం. మేం ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముస్లిం సోదరీమణులకు ఒక అన్నగా ఉంటూ వారి కోసం ట్రిపుల్ తలాక్ తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. మీరు ఒకసారి గ్రామాల్లో వెళ్లి ముస్లిం మహిళలని అడగండి. మెజార్టీ ముస్లిం మహిళలు బిజెపికి ఓటేస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఆదరాభిమానాలను చూస్తున్నా. 

వరదల సమయంలో తెలంగాణ అతలాకుతలమైనప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి ఎలాంటి సహాయం చేయలేదు?  ఒక మెడికల్ కళాశాల కాదు కదా కనీసం నవోదయ పాఠశాల కూడా ఇవ్వని బిజెపికి ఎలా ఓటేయాలని బీఆర్ఎస్ మిమ్మల్ని విమర్శిస్తోంది కదా? 
►దేశవ్యాప్తంగా 1000 మెడికల్ కాలేజీలు పెట్టాలనుకుని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. మీకు కాలేజీలు ఎక్కడ అవసరం? ఏ జిల్లాలో పెట్టాలి?  అన్న వివరాలు ఇవ్వమని అడిగాం. ఆ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న హర్షవర్ధన్ స్వయంగా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. కానీ మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారంటే.. కేంద్రానికి వంద లేఖలు రాసినా పట్టించుకోలేదని. ఇంత అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదు. ఒకవైపు సమయం గడిచిపోతుంది.. వివరాలు ఇవ్వమని హర్షవర్ధన్ లేఖ రాస్తే.. మీరు ఫామ్ హౌస్ లో నిద్రమత్తులో ఉండి పట్టించుకోలేదు. మీకు ఎన్ని సార్లు రిమైండ్ చేసినా పట్టించుకోకుండా తీరా ఎన్నికల సమయంలో నేను 100 ఉత్తరాలు రాసానండి చెబితే ప్రజలు నమ్ముతారా? చూపించండి.? మీరు రాసిన ఉత్తరాలు ఎక్కడ ఉన్నాయో?

తెలంగాణకు కేంద్రం నిధులెందుకివ్వలేదు..?
►తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధంగా ఉన్నా. కేంద్రం ఇవ్వకపోతే వీళ్లు దుబాయ్‌ నుంచి డబ్బు తెచ్చారా. మజ్లిస్‌ పార్టీ ఆఫీస్‌ నుంచి తెచ్చారా.

విద్యుత్‌ మీటర్ల విషయంలో 40 వేల కోట్లు ఆపారట?
►ఏమీ ఆపలేదు. కరెంటు దొంగతనం మొత్తం రైతులమీద వేస్తున్నారు. ఇది అరికట్టేందుకు మీటర్లు పెట్టమన్నాం. కరెంటు దోపిడీ ఆపేందుకే మీటర్లు తెచ్చాం. నవోదయ స్కూళ్లు ఎందుకు ఇవ్వలేదు? జిల్లాలు ఇష్టం వచ్చినట్లు మార్చుకుని నవోదయ స్కూళ్లు ఇవ్వలేదంటే ఏం చెప్తాం. అయినా 17 నవోదయయ స్కూళ్లకు క్యాబినెట్‌ నోట్‌ రెడీ అయింది. త్వరలో ఇస్తాం. రీజినల్‌ రింగ్‌ రోడ్డు రూ. 26 వేల కోట్లతో ఇచ్చాం. ఇప్పటికీ స్థల సేకరణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ట్రిపుల్‌ఆర్‌ తెలంగాణకు ప్రత్యేకంగా ఇస్తున్నాం. కేసీఆర్‌ బడ్జెట్‌లో పెట్టిన రూ.2 వేల కోట్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు.

మెట్రో రెండో దశ ఎందుకివ్వలేదు?
►వీళ్లు మెట్రో మొదటి దశనే పూర్తిచేయలేదు. ఇక రెండో దశ ఎక్కడిది. హైదరాబాద్‌ అంటే హైటెక్‌ సిటీ ఒక్కటే కాదు. ఓల్డ్ సిటీలో రోడ్లు వేయరు. బీఆర్‌ఎస్‌ రియల్టర్లు వ్యాపారం చేసేచోటే ఫ్లై ఓవర్లు , రోడ్లు వేశారు. సీఎం ఇంటి వెనుకాల బోరబండలో రోడ్లు, డడ్రైనేజీల పరిస్థితేంటి.. రా కేటీఆర్‌ చెప్పు. హైదరాబాద్‌లో అక్కడక్కడా చేసిన అభివృద్ధికి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వమే.

కర్ణాటకలో మీపై కమీషన్ల అపవాదు ఎందుకు వచ్చింది ?
►సకల మోసాలకు కాంగ్రెస్‌ కారణం. అవినీతికి కాంగ్రెస్‌ కారణం. కాంగ్రెస్‌ మాటలకు విలువ లేదు. అక్కడ సరే. ఇక్కడ కమీషన్లు కాదు తెలంగాణలో ప్రభుత్వం ఏకంగా కాంట్రాక్టర్ల వద్ద నుంచి వాటాలు తీసుకుంటోంది.

ఐటీఐఆర్‌ గుజరాత్‌కు తీసుకుపోయారట?
►ఎవడు చెప్పింది. ఐటీఐఆర్‌ మొత్తానికే రద్దయింది.

కాంగ్రెస్‌ గ్యారెంటీలు ఉత్తవేనని మీరెందుకు ప్రచారం చేయడం లేదు?
►చేశాం. మాజీ సీఎం యడ్యురప్ప మొన్ననే ఇక్కడికి వచ్చి చెప్పారు. మా మేనిఫెస్టో ప్రొడక్టివిటీతో కూడిన మేనిఫెస్టో. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్తే మేం కూడా ఇంట్లో కూర్చొని గెలుస్తాం.

దేశంలో బీజేపీ సీఎంలు ప్రజలను కలుస్తున్నారా ?
►ఎందుకు కలవడం లేదు. బీజేపీ సీఎంలకు ఫాంహౌజ్‌లు లేవు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశారు. విదేశాలకు వెళితే జెట్‌లాగ్‌ ఉంటుంది. అయినా ఆయన నేరుగా విమానం దిగి ఆఫీసుకు వచ్చి పనిచేస్తారు.

చివరగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని, ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో సిద్దించిన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలన్నదే తమ టార్గెట్‌ అని చెప్పుకొచ్చారు. ఇక, బీజేపీ ధీమాపై ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఎన్నికల ఫలితాల్లో చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement