సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ సమాధానం చెప్పలేదని, తమకు జవాబుదారీతనమే లేదని మరోమారు ప్రధాని నిరూపించుకున్నారు’అని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించామని, కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప తమ పార్టీకి విధానమే లేదని మోదీ తేల్చేశారన్నారు. ప్రధాని ప్రసంగంపై మంత్రి స్పందిస్తూ.. ‘గుజరాత్‌కు క్రూడాయిల్ రాయల్టీ రూ.763 కోట్లు విడుదల చేశారు.
రాజ్‌కోట్‌కు ఎయిమ్స్, బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా, ట్రెడిషనల్ మెడిసిన్‌కు గ్లోబల్ సెంటర్ మంజూరు చేశారు. మిషన్ యూపీ కింద రూ.55,563 కోట్లు, 9 మెడికల్ కాలేజీలు, కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రకటించారు. కర్ణాటకకు తుముకూర్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ముంబై–బెంగళూరు ఎకనామిక్ కారిడార్, మైసూర్ టెక్స్‌టైల్ మెగా క్లస్టర్.. వంటివి ఇచ్చారు. కానీ, తెలంగాణకు మొం డి చెయ్యి చూపారు’’ అని మండిపడ్డారు.
ప్రధాని రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క ప్రకటనా చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని చెప్తున్న మోదీ, నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ఎందుకు తీసుకోవడం లేదన్నారు. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశమిచ్చామంటున్న కేంద్రమంత్రులు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే ఎందుకు ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ అనుమతులు, నిధులు ఇవ్వలేదని, సమ్మక్కసారక్క ఉత్సవానికి జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదని, తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడం లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
అన్నీ అబద్ధాలే: ప్రకాశ్‌రాజ్
ప్రధాని మోదీ ప్రసంగంపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా స్పందించారు. ‘ప్రజలడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు. అబద్ధాలు తప్ప’అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment