సాక్షి, మహబూబాబాద్/ములుగు/నర్సంపేట: టీపీసీసీ అధ్యక్షుడు ఒక్కో టికెట్ రూ.10కోట్లు, ఐదుఎకరాల భూమికి అమ్ముకుంటున్నాడని, ఆ పార్టీ నాయకులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సైతం అమ్మేస్తారని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ములుగు, నర్సంపేటలలో మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు, మరిపెడ, తొర్రూరులో వంద పడకల ఆస్పత్రుల భవనాలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గృహలక్ష్మి, దళితబంధు ప్రొసీడింగ్ కాపీలు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు పథకాలు అమలు కావని, ఆరుగురు ముఖ్యమంత్రులు మారుతారన్నారు. రాష్ట్రంలో మత కలహాలు, కొట్లాటలు సైతం జరుగుతాయని చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.600 పింఛన్ ఇస్తుంటే, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మెడికల్ కళాశాలలు లేక విదేశాలకు వెళ్లి చదవాల్సిన దుస్థితి ఉండేదని, ఇప్పుడు డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవనుందన్నారు.
ఒకప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో ఇనుప చప్పుళ్లు, ఎన్‌కౌంటర్లు విన్నామని, ఇప్పుడు గలగల పారే నీళ్లు, ఉచిత కరెంట్‌తో పచ్చని పంటలు చూస్తున్నామని చెప్పారు. గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వకపోడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీఓనే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3లక్షల మందికి మాత్రమే పట్టాలు ఇస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం 4.06లక్షల మందికి పట్టాలు ఇచ్చి, ఎనిమిది రకాల సౌకర్యాలు అందిస్తుందని చెప్పారు.
రైతు విలువపెంచిన సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పాలనలో కరువు కాటకాలు, వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ.. వర్షం కురవాలని కప్పతల్లి ఆటలు.. శివుడిగుడిలో పూజలు చేసేవారని,. నేడు సీఎం కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరంతో నేడు కళకళలాడే పచ్చటి భూములకు నిలయంగా తెలంగాణ ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాడు ఎకరం రూ.20వేలు ఉన్న భూమి విలువ ఇప్పుడు రూ.30లక్షలకు పెరిగిందని.. భూమి విలువే కాకుండా..రైతు విలువను కూడా సీఎం కేసీఆర్ పెంచారన్నారు.
మోదీ వచ్చి ఏం చెబుతారు ?
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలు చేయడం చేతకాని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చి ఏం చెబుతారన్నారని మంత్రి ప్రశ్నించారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు మంజూరు చేయలేదన్నారు.
ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్, శంకర్‌నాయక్, హరిప్రియ, సీతక్క, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాత మధు, జెడ్పీ చైర్‌పర్సన్లు గండ్ర జ్యోతి, బడే నాగజ్యోతి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ప్రావీణ్య, శశాంక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment