
పట్నా: రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని.. ఎన్డీఏ, ఆర్జేడీ నాయకత్వంలోని కూటమికి సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నాయకుడు ఉపేంద్ర కుష్వాహ ప్రకటించారు. ఈ ఫ్రంట్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్‌పార్టీ భాగస్వామిగా ఉంటుందని కుష్వాహ చెప్పారు. గత పదిహేనేళ్ళుగా రాష్ట్రాన్ని ఏలిన నితీష్ కుమార్, అంతకు ముందు దశాబ్దంన్నర పాటు రాష్ట్రాన్ని ఏలిన లాలూ ప్రసాద్, రబ్రీదేవి పాలనలను ఒకే నాణేనికి ఇరువైపుల ఉన్న బొమ్మా బొరుసుగా ఆయన పేర్కొన్నారు.
బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ కలిసి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి బరిలోకి దిగుతోంది. (చదవండి: ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే)
Comments
Please login to add a commentAdd a comment