చిలకలూరిపేట: రాష్ట్రానికి విలన్ టీడీపీ నేత చంద్రబాబేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పన్నుల భారం మోపి, ఇష్టారీతిన విద్యుత్ చార్జీలు పెంచి, పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ విధించి ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు పూర్తిగా అరాచక పాలన సాగించారని విమర్శించారు. ఇప్పుడేమో వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు విమర్శలను ఖండిస్తూ మంత్రి రజిని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ చార్జీలు పెంచారని చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు విద్యుత్ చార్జీలను భారీగా పెంచిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యుత్ చార్జీల మోత మోగించేవారని గుర్తు చేశారు. 2015 ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.4 అదనపు వ్యాట్ విధించిన చరిత్ర చంద్రబాబుదన్నారు.
రాష్ట్రంలో బెల్టుషాపుల వ్యవస్థను సృష్టించిన చంద్రబాబు.. మద్యపాన నిషేధాన్ని సైతం ఎత్తివేశారని.. అలాంటి వ్యక్తి నేడు మద్యం గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. టీడీపీ నాయకులు ఊరూరా మద్యం అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులన్నింటినీ రద్దు చేసిందని గుర్తు చేశారు.
2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్య పెట్టేందుకు టిడ్కో ఇళ్లను తెరపైకి తెచ్చారని విమర్శించారు. అందుకే ప్రజలు టీడీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో, మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో, టీడీపీ గూండాలు ఎలా రెచ్చిపోయారో ప్రజలింకా మర్చిపోలేదన్నారు.
శాంతిభద్రతల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసుల పనితీరుకు గాను ఇప్పటికే 200కు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. నాడు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడితే.. చంద్రబాబు వారందరికీ అండగా నిలిచారని విమర్శించారు.
ఏపీకి విలన్ చంద్రబాబే
Published Tue, Jun 20 2023 4:35 AM | Last Updated on Tue, Jun 20 2023 9:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment