సాక్షి, న్యూఢిల్లీ: దొంగ ఓట్ల నమోదులో ప్రపంచ ఛాంపియన్ అయిన చంద్రబాబు బోగస్ ఫిర్యాదులు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దొంగే.. దొంగా..దొంగా అనడానికి సరైన అర్థం చంద్రబాబు అని తెలిపారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తిరిగి అదే ఎన్టీఆర్‌కు పూలమాల వేయగలగడం చంద్రబాబుకే సాధ్యమన్నారు.
ఎన్టీఆర్‌ను బతికున్న రోజుల్లో బాగా చూసుకున్న వారిని వదిలేసి.. ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ పేరుతో రూపొందించిన రూ.100 నాణెం ఆవిష్కరణ సభలో పాల్గొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ బృందంతో భేటీ అయ్యారు.
2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించడంపై చర్చించారు. దొంగ ఓట్ల నమోదుపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
2015 నుంచి టీడీపీ దొంగ ఓటర్ల వివరాలిచ్చాం
చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓటర్ల మాల్‌ప్రాక్టీస్‌పై ఎన్నికల సంఘం అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. అధికారులు సానుకూలంగా స్పందించారు. బాబు హయాంలో మా పార్టీ ఓట్ల గల్లంతు, టీడీపీ వ్యక్తుల దొంగ ఓట్లపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి వివరించాం. ఉదాహరణకు లక్ష్మి అనే మహిళ పేరును రకరకాల స్పెల్లింగ్‌లతో, వయస్సులు, ఇంటిపేర్లు, భర్త పేర్లు, డోర్ నెంబర్ సబ్‌డివిజన్ చేసి .. ఇలా రకరకాల మార్పులతో అనేక ఓట్లుగా చంద్రబాబు ఎలా చేర్పించారో ఆధారాలతో అందించాం. ఎన్నికల కమిషన్ ఉన్నతాశయాలను దుర్వినియోగం చేస్తూ రోడ్లపై అనాథల్లా తిరిగే వారిని, స్థిరనివాసం లేని సంచారులను సైతం ఏదో ఒక డోర్ నెంబర్ మీద ఓటర్లుగా చేర్చి పెట్టుకున్నాడు చంద్రబాబు.
2015 నుంచి 2017 వరకు అన్ని వివరాలు ఇచ్చాం. 2019 ఎన్నికలకు ముందు 3.98కోట్ల మంది ఓటర్లు ఉంటే.. ఈ రోజుకు 3.97 కోట్ల ఓటర్లు ఉన్నారు. తేడా లక్ష మాత్రమే. సగటున ప్రతి వెయ్యి మందికి ఓటర్ల వివరాల్ని చూశాం. రాష్ట్రంలో 63 నియోజకవర్గాల్లో 20 చోట్ల 15,800 దొంగ ఓట్లు నమోదైనట్లు తేలింది. 40 నియోజకవర్గాల్లో 5,800 నుంచి 6,000 వరకు దొంగ ఓట్లు తేలాయి. ఇవన్నీ ఏయే జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయో టేబుల్ రూపంలో అందించాం. ఓటర్ల జాబితాలో వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు ఆనాడు ఏ విధంగానైతే రాజకీయంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేశాడో.. ఆ విధానాల్ని మా పార్టీ అమలు చేయలేదు.
చంద్రబాబు ఓటర్ల జాబితాలపై ఎందుకు వణుకుతున్నాడో కూడా ఎన్నికల సంఘానికి వివరించాం. 2019 ఎన్నికలకు ముందు చేర్చిన దొంగ ఓటర్లే ఈనాటి దాకా జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జాబితాలపై రీసర్వే చేస్తూ.. ఆధార్‌తో ఓటర్ ఐడీని లింక్ చేస్తే ఆయన దొంగ ఓట్లన్నీ బయటకొస్తాయి. ఇదే జరిగితే మరోసారి ఆయన ఓటమి ఖాయం. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే వైఎస్సార్‌సీపీపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు.
నాడు సేవా మిత్ర.. నేడు మై టీడీపీ యాప్‌తో
గతంలో సేవామిత్ర యాప్ ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరులెవరో తెలుసుకొని, వైఎస్సార్‌సీపీ ఓటర్లను జాబితాల్లో నుంచి తొలగించారు. ఈ విషయం తెలుసుకుని మేం ఆనాడు పోరాటం చేశాం. ఇప్పుడు అదే బాటలో ‘మై టీడీపీ’ యాప్ అంటూ ఓటర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారో, దానిని చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం.
అశోక్ డాకవరం అనే వ్యక్తి టీడీపీ తరఫున ఓటర్ల సమాచారాన్ని సేకరించడం, దాంతో ఓటర్‌కు తెలియకుండానే ఓటు తొలగింపు, కొత్త ఓటర్లను చేర్చుకొనే దరఖాస్తుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఆధారాలతో సహా వివరించాం. ఓటరు సర్వేలో అభ్యంతరకరమైన ప్రశ్నలతో చంద్రబాబు మెథడాలజీని అశోక్ అమలు చేస్తున్నారు. ఓటర్ పొలిటికల్ ప్రిపేర్‌డ్‌నెస్, పార్టీ ఛాయిస్‌తో ఏం సంబం«దం ఉందని అశోక్ అడుగుతున్నారు? అతని అవసరమేంటి? ఓటరు కులం ఏమిటో కూడా అడుగుతున్నారు.
దీన్నిబట్టి చంద్రబాబులో కుల ఉన్మాదం ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. సభ్య సమాజంలో ఏ వ్యక్తి, ఏ నాయకుడైనా ఓటరును కులం అడగగలరా? ఇవి చాలా నేరపూరితమైన విషయాలుగా వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం.
పారదర్శక ఓటర్ల జాబితా వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం
బోగస్ ఓట్లను ఏరివేయాలని, పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరగాలనేది వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ముందు ప్రధానంగా రెండు డిమాండ్లు ఉంచాం. ఓటరు ఐడీతో ఆధార్ కార్డు లింకు చేయాలని కోరాం. దీనిద్వారా చంద్రబాబు దొంగ ఓట్లు చేర్పించే దురాలోచనకు బ్రేకులు పడతాయి. అదేవిధంగా ఆధార్ లింకుతో బయోమెట్రిక్ సదుపాయం ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు (వన్‌సిటిజన్.. వన్ ఓట్) అనే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం నెరవేరుతుంది.
చంద్రబాబు ఈరోజు వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లు చేరుస్తోందంటూ దొంగే.. దొంగా, దొంగా.. అన్నట్లు రంకెలేస్తున్నారు. వాస్తవానికి ఆయన ఓటర్ల జాబితా మాల్‌ప్రాక్టీస్‌పై మేము వైఎస్సార్‌సీపీ తరఫున 2018లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2014 నుంచి నేటి వరకు ఓటర్ల జాబితాలపై ప్రత్యేక విచారణ చేయాలని కోతున్నాం. దొంగ ఓట్లు చేర్చడం, నిజమైన ఓటర్ల వివరాల గల్లంతుకు ఎవరు పాల్పడ్డారనే వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాం.
Comments
Please login to add a commentAdd a comment