సాక్షి, అమరావతి: విపక్ష నేత చంద్రబాబునాయుడి జీవితమంతా మోసం, కుట్ర, కుతంత్రాలతో నిండిపోయిందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. లక్షల ఓట్లను తొలగించాలంటూ కోనేరు సురేష్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు బల్క్ ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. కోనేరు సురేష్ ఇచ్చిన అబద్ధపు బల్క్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేశామన్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ ఓట్లను టార్గెట్ చేసిందన్నారు.
మరోవైపు దొంగ ఓట్ల చేర్పునకూ టీడీపీ పాల్పడుతోందన్నారు. ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’ పేరుతో చంద్రబాబు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా అర్హుల ఓట్లు తొలగించేందుకు, దొంగ ఓట్ల చేర్పుకు చంద్రబాబు భారీ కుట్ర చేశారని చెప్పారు. ఓటరు కులం, రాజకీయ ప్రాధాన్యత అడిగే హక్కు బాబుకెవరిచ్చారు? అని నిలదీశారు. ‘వన్ సిటిజన్.. వన్ ఓట్’ అనేది తమ పార్టీ సిద్ధాంతం అని తెలిపారు.
ఓటర్ ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అని చెప్పారు. మొత్తం ఆరు అంశాలపై సీఈసీని కలిశామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులను కలిసిన అనంతరం మంగళవారం విజయవాడలోని నోవోటెల్ హోటల్ వద్ద ఆయన ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
గుర్తింపులేని జనసేనకు అవకాశమా?
గుర్తింపులేని పార్టీ జనసేన. సాధారణంగా గుర్తింపు ఉన్న పార్టీలకే ఎన్నికల సంఘాన్ని కలిసి వారి అభ్యంతరాల్ని చర్చించే అవకాశం ఉంటుంది. టీడీపీతో పాటు జనసేన పార్టీకి కూడా సీఈసీని కలిసే అవకాశమిచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపులేని జనసేనకు సీఈసీని కలిసే అవకాశం ఎలా ఇవ్వగలిగారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాము. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన అపాయింట్‌మెంట్ రిక్వెస్టులో జనసేన పార్టీ తమ అలయెన్స్‌గా చెప్పి ఆపార్టీని కూడా అనుమతించాలని కోరింది.
ఇప్పటి వరకు జనసేన పార్టీ బీజేపీ అలయెన్స్ పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. జనసేన బీజేపీకి పార్టనరా? టీడీపీకి పార్టనరా? అనేది స్పష్టం చేయాల్సిన అవసరముందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. రెండు వేర్వేరు పార్టీలతో అలయెన్స్ పెట్టుకున్న గుర్తింపులేని పార్టీ జనసేనను ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఎలా అనుమతించారనేదే మా వాదన.
జనసేన పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతోంది. అలాంటి, గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్‌గా ఉన్న గాజుగ్లాసు గుర్తును కేటాయించడం కూడా చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు రెండో అంశంగా నివేదించాం.
బోగస్ ఫిర్యాదుదారుడు కోనేరు సురేష్‌పై చర్యలేవి?
టీడీపీకి చెందిన కోనేరు సురేష్ ఆపార్టీ ఎలక్టోరల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్, బోగస్ ఓట్లంటూ ఓ బల్క్ కంప్లయింట్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాడు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్‌గా ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని సీఈసీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఒకే వ్యక్తి రాష్ట్రంలోని 175 స్థానాల్లో 10 లక్షల ఓట్లకు సంబంధించి బల్క్ కంప్లయింట్ ఎలా ఇవ్వగలుగుతారు? దాన్ని ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్వీకరిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం.
టీడీపీ వ్యక్తి ఇచ్చిన బల్క్ కంప్లయింట్ ఆధారంగా ఎన్నికల అధికార యంత్రాంగం మొత్తం పనిచేస్తుందా? అని మేము అడుగుతున్నాం. ఆ ఫిర్యాదుపై విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలొచ్చాయి. అయితే, ఆ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్‌లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఏమాత్రం నిజం లేదని తేలింది. దీన్నిబట్టి కోనేరు సురేష్ ఎన్నికల కమిషన్ సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్థం చేసుకోవాలి.
ఈ రకంగా టీడీపీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి, విలువైన ఎన్నికల సంఘం సమయాన్ని వృథా చేయడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాలని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. కోనేరు సురేష్ ఫిర్యాదు బోగస్ అని తేలింది కాబట్టి అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరాం.
ఓటర్ ప్రొఫైలింగ్ మాల్‌ప్రాక్టీస్ తీరిది
ఎన్నికల కమిషన్ డ్యాష్‌బోర్డులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని టీడీపీకి చెందిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’లో ఓటర్ పేరు, ఊరు, ఇతర చిరునామా, జెండర్, వయసు, కులంతో పాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నంబర్ వంటి వివరాలున్నాయి. రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరుచేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. టీడీపీ సేకరించిన ఓటర్ డేటా అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్ వద్ద స్టోర్ చేస్తున్నారు.
అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించడం, అప్పట్లో ఆ యాప్‌పై ఎన్నికల సంఘం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. అప్పట్లో టీడీపీకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్ నంబర్ 174–2019పై కూడా ఎలాంటి పురోగతి లేదన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. ఇప్పుడు ‘మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్’ ద్వారా ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమంపై 120(బి), 379, 420, 188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ 2000 యాక్ట్) కింద యాక్షన్ తీసుకోవాలని ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరాం.
‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు
రాబోయే ఐదేళ్లలో టీడీపీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనే లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులందజేతను ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశాం.
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లే టార్గెట్
ఓటర్ల జాబితాలపై టీడీపీ రోజుకో అబద్ధంతో అటు ఓటర్లనూ, ఇటు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవబట్టిస్తోంది. కోనేరు సురేష్ ఫిర్యాదుపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి మూడు జిల్లాల సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకున్నాం.
♦ కర్నూలు జిల్లాలో సురేష్ ఫిర్యాదు ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయి. అయితే, వీఆర్వోలు వెరిఫై చేశాక వాటిల్లో 59,054 ఓట్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. అంటే, 87 శాతం నిజమైనవి. మిగతా ఓట్లు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం పరిధిలోకి మారిన వారివిగా గుర్తించారు.
♦ అన్నమయ్య జిల్లాలో 40,358 బోగస్ ఓట్లు ఉన్నట్టు ఫిర్యాదు చేస్తే, వాటిలో 25,097 మంది ఓటర్లు స్థానికంగానే నివాసం ఉంటున్నట్లు తేలింది. అంటే, 62 శాతం ఓట్లుకు సంబంధించి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు అబద్ధం.
♦ విశాఖపట్నం జిల్లాలో 38,872 ఓట్లు బోగస్‌వి అని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. వాటిలో 26,123 ఓట్లు జెన్యూన్‌గా ఉన్నట్లు తేలింది. అంటే 67 శాతం ఓట్లు వాస్తవమైనవే.
♦ ఒకే వ్యక్తి ఇచ్చే బల్క్‌కంప్లయింట్‌లు స్వీకరించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాం.
అసభ్య పదజాలం వాడుతున్న తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలి
చంద్రబాబు చేపడుతున్న టీడీపీ కార్యక్రమాల్లోనూ, లోకేశ్ యువగళం పాదయాత్రలోనూ వైఎస్సార్సీపీపైన, మా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైన అసభ్యకర పదజాలం వాడుతూ దూషించడాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. ఆ తండ్రీకొడుకులపై ఇండియన్ పీనల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని కూడా కోరాం. లోకేశ్ ఓ ఎర్రబుక్కు చూపిస్తూ, ‘టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అధికారుల పేర్లు ఈ ఎర్రబుక్కు (రెడ్‌బుక్)లో ఎక్కించి.. అధికారంలోకి రాగానే వారిని జైళ్లకు పంపుతాను’ అంటూ బెదిరిస్తున్నారు.
♦నిజానికి ప్రభుత్వ అధికారులు ఏ పొలిటికల్ పార్టీకి పనిచేయరు. అధికారులెప్పుడూ బ్యాలెన్సింగ్‌గానే పనిచేస్తారు. అలాంటి అధికారులను జైళ్లకు పంపుతానంటూ భయభ్రాంతులకు గురిచేయడం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం.
పార్లమెంట్ ఎన్నికలు ఉభయరాష్ట్రాల్లో ఒకేరోజు జరపాలి
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజున నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. ఓటర్ల జాబితాల సవరణల్లో టీడీపీ చాలా దొంగపనులు చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకొచ్చిన ప్రతీసారి మోసపూరిత, కుట్రపూరితమైన విధానాలతోనే ఎన్నికల ప్రక్రియను నడిపించారు. ఇప్పుడు అలాంటి దొంగపనులకు శ్రీకారం చుట్టాడు కాబట్టే మేం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేస్తున్నాం.
టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్
వైఎస్సార్‌సీపీ తరఫున మేం 14 డిసెంబర్ 2023న కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు ఇచ్చాం. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాం. ఓటరు కులమేంటి? మతం ఏంటి? గతంలో ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు? అని అడిగే హక్కు రాజ్యాంగం ప్రకారం ఎవరికీ లేదు. టీడీపీ మాత్రం ఈ విధమైన ఓటర్ ప్రొఫైలింగ్‌కు పాల్పడుతుందనే విషయాన్ని గతంలోనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం.
4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం
ఓటర్ల పేర్లలో చిన్న అక్షరాలు మార్చి స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లుగా జాబితాలో ఓట్లను చేర్చే కార్యక్రమం టీడీపీ చేస్తోంది.తండ్రిపేరు లేదా భర్త పేరు మార్చి డూప్లికేట్ ఓట్లను ఆ పార్టీ తయారు చేయడానికి తెగించింది. తెలంగాణలో ఉన్న ఓట్లను కూడా ఏపీ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 4,36,268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. వీటి వివరాల్ని ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి, వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కోరాం.
తెలంగాణ ఓట్ల నమోదుకు టీడీపీ ప్రత్యేక శిబిరాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున, అక్కడున్న ఏపీ సెటిలర్స్‌తో ఆంధ్రా ఎన్నికల్లో ఓటు వేయించేందుకు టీడీపీ వ్యూహం పన్నింది. అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఓట్ల చేర్పులు జరుగుతున్నాయి. టీడీపీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఏపీలో ఓటు హక్కు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం.
Comments
Please login to add a commentAdd a comment