సాక్షి, అమరావతి: జాతీయ పార్టీ అయిన బీజేపీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ‘బావ’ సారూప్య పార్టీగా మార్చేశారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘అమ్మా పురందేశ్వరీ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించారు. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. 13 సార్లు సంతకం కూడా పెట్టారు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక తప్పుడు ఒప్పందంతో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ఈడీ కొందరిని అరెస్ట్ కూడా చేసింది.
ఆ ఒప్పందం ఫేక్ అని, దానితో సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్థించి, రిమాండ్ విధించింది. బాబు అరెస్ట్, రిమాండ్ సరికాదన్న వాదనల్ని హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయి’ అని ఆయన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ‘సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో ఆయన పీఏనే వెల్లడించినట్లు ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా రూ.119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ ఐటీ శాఖ మీ మరిది చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్దార్డ్ లూథ్రా, హరీష్ సాల్వే చంద్రబాబు కోసం చేసిన వాదనల్ని న్యాయస్థానాలూ తిరస్కరిస్తున్నాయి కాబట్టి, ‘బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్’ అన్న విధంగా మీ మరిది కోసం మీరు రంగంలోకి దిగారు. అన్ని ఆధారాలు కనిపిస్తుంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని అబద్ధం చెపుతూ, లోకేశ్‌ని వెంటబెట్టుకుని బాబు తరపున మధ్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని కలిశారు.
ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా ఇప్పుడు బీజేపీలో ఉన్నానని అంటున్నా మీ టాప్ ప్రయారిటి మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment