సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహిస్తున్న విజయసంకల్పరథ యాత్రల విజయవంతం ద్వారా పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకునే అవకాశముందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ లోక్‌సభ సీట్లలో పార్టీ గెలవాలంటే నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
గురువారం రాష్ట్రపార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విజయసంకల్పయాత్రలో పాల్గొనబోయే సభ్యులను ఉద్దేశించి కిషన్‌రెడ్డి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... ఈ యాత్ర ప్రాధాన్యతను గుర్తించి అందరూ కష్టపడి పనిచేయాలని లేని పక్షంలో పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఈ యాత్రల్లో చురుగ్గా పనిచేయలేమని భావించే వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు. పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా, జాతీయ నాయకత్వం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ పనిచేయాలనుకునే వారే బాధ్యతలు, పదవుల్లో కొనసాగాలని స్పష్టం చేశారు.
చాయ్ టిఫిన్ పేరిట నేతలతో కిషన్ భేటీ
గురువారం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌రావు, ఆదిలాబాద్ జిల్లా పార్టీ నేతలతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు.
చాయ్–టిఫిన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ భేటీలో ఈ నెల 20న బాసర సరస్వతీ మాత ఆలయంలో పూజల అనంతరం భైంసాలో మొదలుపెట్టనున్న విజయసంకల్పయాత్ర ఏర్పాట్ల అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది.
బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి కిషన్ రెడ్డి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment