సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్ వెంకటస్వామి పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరి దారిలోనే బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పయనించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రెండు లిస్టుల్లో 53 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మూడో లిస్టు పై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇదే పని మీద స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జనసేన తో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపైనా బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఈ పొత్తులో భాగంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సీటును జనసేనకు కేటాయిస్తారన్న లీకులు బయటికి వస్తున్నాయి.
శేరిలింగంపల్లి సీటు విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తన పార్లమెంటు నియోనజకవర్గం పరిధిలోకి వచ్చే సీటును జనసేనకు ఎలా ఇస్తారని, ఎప్పటినుంచో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కొడుకు రవియాదవ్ కే సీటు కేటాయించాలని కొండా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సీటును రవియాదవ్ కు ఇవ్వకపోతే తానూ బీజేపీకి రిజైన్ చేస్తానని పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం.
ఈ వ్యవహారం ఇలా ఉంటే కొండా పార్టీని వీడితే ఆయన బాటలోనే స్టేట్ బీజేపీ మరో టాప్ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈటల భార్య జమునా రెడ్డి కొండాకు దగ్గరి బంధువవుతారు. రాజకీయంగా వీళ్లంతా కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తాజా పరిణామాలతో స్టేట్ బీజేపీ నుంచి నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక
Comments
Please login to add a commentAdd a comment