సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు పలువురు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పలు రాష్ట్రాలకు బీజేపీ విస్తరిస్తోన్న నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతోన్న నేపథ్యంలో ఈ పార్టీ ఫిరాయింపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అదే బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేంద్ర యాదవ్ అనూహ్యంగా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర పర్యటనకు వెళ్లడంతో అక్కడి పార్టీ సీఎం యడియూరప్పకు పదవీ గండం తప్పదనే ప్రచారం ఊపందుకుంది.
యడియూరప్పతో సహా రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులకు కూడా భూపేంద్ర యాదవ్ పర్యటన గురించి చివరి నిమిషం వరకు తెలియకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే యడియూరప్పను ఇప్పటికిప్పుడు మార్చే ఆలోచనేమీ లేదని భూపేంద్ర యాదవ్ స్వయంగా ప్రకటించడంతో సమీప భవిష్యత్తులో ఆయన్ని మార్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ కర్ణాటక పర్యటనకు వెళ్లినప్పుడే అక్కడ రాష్ట్ర నాయకత్వ మార్పునకు సంబంధించి మొదటిసారి చర్చ మొదలయింది. అంతకుముందు నెల యడియూరప్ప ఢిల్లీకి రావడం కూడా అనుమానాలు దారితీసింది.
రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తానని యడియూరప్ప ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు ప్రకటించారు. అయితే దాన్ని ఇప్పటి వరకు నెరవేర్చలేక పోయారు. పార్టీ కేంద్ర నాయకత్వం సమ్మతి లేకపోవడం వల్లనే మంత్రివర్గాన్ని ఆయన విస్తరించలేక పోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర పార్టీ నాయకత్వాన్ని సంప్రతించి త్వరలో రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాల్సిందిగా యడియూరప్పకు తన పర్యటన సందర్భంగా భూపేంద్ర యాదవ్ సూచించినట్లు తెల్సింది. తాను కూడా రాష్ట్ర కేబినెట్ విస్తరణపై పార్టీ ఇతర నాయకుల అభిప్రాయాలను కూడా ఆయన సేకరించి వెళ్లినట్లు తెలుస్తోంది. (చదవండి: యడియూరప్ప స్థానంలో యువ సీఎం!)
Comments
Please login to add a commentAdd a comment