పాదయాత్రలో స్వాగతం పలకడానికి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరిస్తున్న షర్మిల
చింతపల్లి: ‘వైఎస్సార్ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి.. మీకు సేవకురాలిగా పనిచేస్తా’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్, ఎర్రమట్టితండా, బోటిమీదితండా, పాలెంతండా, చౌళ్లతండా, చాకలిశేరిపల్లి, ఉమ్మాపురం, గొల్లపల్లి, సమైక్యనగర్ మీదుగా కుర్మేడు ఎక్స్‌రోడ్డు వరకు సాగింది. ఈ సందర్భంగా గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన ‘మాట ముచ్చట’కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు.
ప్రాజెక్టుల పేరుతో పట్టా భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందన్నారు. ప్రభుత్వమే తప్పుచేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని ఆశపడిన నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇస్తే ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని, దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చిన పాపానపోలేదన్నారు. కనీసం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారని అన్నారు. వైఎస్సార్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన కేసీఆర్ పాలనను అంతంచేసి తిరిగి రాజన్న పాలనను సాధించుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు.
నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఏడు సంవత్సరాల్లో 800 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాలకు చెందిన మహేశ్ అనే యువకుడు ఉద్యోగం రావడం లేదని పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.
పీజీలు చదివి ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు రూ.8వేలు నుంచి రూ.10వేల జీతాలకు పని చేస్తున్నారని అన్నారు. ఏ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకుందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, సురేశ్‌రెడ్డి, సత్యవతి, భాస్కర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, సిరాజ్, నవీన్, కల్యాణ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment