రత్తిపల్లి గ్రామంలో నిర్వహించిన మాటముచ్చటలో మాట్లాడుతున్న షర్మిల
మునుగోడు: ‘వరి పంట గంజాయి పంట కాదు కదా.. దానిని ఎందుకు సాగు చేయకూడదు’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం మహాపాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కచలాపురం, ఊకొండి, రత్తిపల్లి గ్రామాల మీదుగా కొనసాగి నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం ఎలికట్టెకు చేరుకుంది. ఈ సందర్భంగా రత్తిపల్లిలో నిర్వహించిన మాటముచ్చట కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు.
రైతులు తమకు నచ్చిన, అధిక లాభం వచ్చే పంటలు సాగు చేసుకోనివ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి నీరివ్వకపోయినా భగవంతుడు పుష్కలంగా నీరు ఇచ్చాడని, వీటితో వరిపంట సాగుచేద్దామంటే వద్దని సీఎం చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గ్యాస్, పెట్రోల్, డీజిల్, బస్‌చార్జీలు పెంచకుండా పరిపాలన కొనసాగిస్తే, టీఆర్‌ఎస్ ప్రభు త్వం ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆరోపించారు. వైఎస్ పాలనలో విద్య, వైద్యం ఉచితంగా అం దిస్తే, కేసీఆర్ పాలనలో వాటిని లక్షల రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
పూటకో అబద్ధం చెబుతూ...
ముఖ్యమంత్రి పూటకో అబద్ధం చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని షర్మిల విమర్శించారు. గాడిదకు రంగుపూసి అది ఆవు అని నమ్మించే మోసకారి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.
ఉపఎన్నికల్లో అభ్యర్థులను ఎలా గెలిపించుకొవాలనే సోయి తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే తీరిక కేసీఆర్‌కు లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, నాయకులు మేకల ప్రదీప్‌రెడ్డి, ఏపూరి సొమన్న, రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాదగోని రాజేశ్‌గౌడ్, పోలగోని ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment