
సాక్షి, అమరావతి: దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ఒకేసారి ఏర్పాటు చేయడాన్ని పురస్కరించుకుని మంగళవారం (ఈనెల 20వ తేదీ) వరకు రాష్ట్రంలోని బీసీలంతా ఉత్సవాలు జరుపుకోవాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా బీసీల పండుగకు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంకురార్పణ చేశారని పేర్కొంది. ఆదివారం పార్టీ జారీచేసిన ఒక సర్క్యులర్‌లో 56 కార్పొరేషన్ల ఏర్పాటు, అందులోనూ సగంమంది మహిళా నేతలకు అవకాశం కల్పించడం ఒక విప్లవాత్మకమైన చర్య అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. వట్టి మాటలే కాదు చేతల్లో కూడా.. ‘బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముకలాంటి వర్గాలు’ అని ముఖ్యమంత్రి సాహసోపేతంగా చేసి చూపించారని పేర్కొన్నారు.
ఇది నిజమైన బీసీల ప్రభుత్వమని వెల్లడించే రీతిలో 139 కులాలకు ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ఇప్పటికే బీసీ సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ప్రభుత్వం కేవలం 16 నెలల్లోనే పలు పథకాల ద్వారా 2,71,37,253 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.33,500 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 56 కార్పొరేషన్లను ప్రకటించడాన్ని పురస్కరించుకుని ఈనెల 20 వరకు పర్వదినాలుగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను అనుసరించి ప్రకటన వెలువడినప్పటి నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు జరపాలని కోరారు. కోవిడ్ నిబంధనల మేరకు అందరూ భాగస్వాములయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment