విస్తృతంగా ఎన్నికల ప్రచారానికి సీఎం వైఎస్ జగన్ ప్రణాళిక
మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియ దాదాపు కొలిక్కి.. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక
రోజుకు 2 లేదా 3 సభలు, రోడ్ షోలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి జనవరి 27న భీమిలి వేదికగా సమర శంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలకు కడలిలా జనం కదలి రావడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడులో నిర్వహించిన సభ అతి పెద్ద ప్రజా సభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ సునామీనేనని ఎన్నికలకు ముందే రాప్తాడు సభ ద్వారా జనం చాటి చెప్పారని విశ్లేషిస్తున్నారు.
పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఆదివారం మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభే చివరిది కానుండటంతో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. జన బలమే గీటు రాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా, గెలుపే లక్ష్యంగా శాసనసభ, లోక్‌సభ సమన్వయకర్తల నియామకం ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. తన ప్రచారంలో మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే ప్రచార పర్వానికి తెరతీసి.. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
విప్లవాత్మక మార్పులు వివరిస్తూ..
గత ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 99 శాతం సీఎం జగన్ అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా 58 నెలల్లోనే డీబీటీ రూపంలో రూ.2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4,38,102.91 కోట్ల లబ్ధిని పేదలకు చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాల ప్రజలు సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల లబ్ధి పొందారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్నారు.
విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రతి జిల్లాలో.. ప్రతి నియోజకవర్గంలో.. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంటా వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటేనే అండగా నిలబడి, ఆశీర్వదించాలని కోరుతున్నారు. మరింతగా మంచి చేసే పాలన తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ప్రచారం చేయనున్నారు.
అవకాశవాద పొత్తులను ఎండగడుతూ
విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమిగా పోటీ చేస్తే.. వైఎస్సార్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో 650 హామీలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే.. వాటి అమలుకు నాది పూచీ అని పవన్ కళ్యాణ్ ప్రజలకు మాట ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల్లో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు.. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్ నుంచే మాయం చేయించారు. వ్యవసాయ రుణాల మాఫీ చేయకుండా రైతులను, డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను.. ఇంటికో ఉద్యోగం లేదా రూ.2 వేల చొప్పున నిరుద్యోగభృతి ఇవ్వకుండా యువతను ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు.
హామీల అమలుకు పూచీ పడ్డ పవన్ కళ్యాణ్ ఏనాడూ వాటిపై చంద్రబాబును ప్రశ్నించిన పాపాన పోలేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు.. కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చివరలో అంటే 2018లో బీజేపీతో విభేదించి ఎన్డీయే నుంచి వేరుపడి ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగారు. తిరుపతిలో రక్షణమంత్రి అమిత్ షాపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు 2019 ఎన్నికల్లో జనసేనతో వేరుగా పోటీ చేయించారు.
ఇప్పుడు మళ్లీ ఓటమి భయంతో జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో జత కలిశారు. వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమన్న భయంతో.. పచ్చి అవకాశ వాదంతో.. అనైతికంగా చంద్రబాబు పొత్తులు పెట్టుకొని, మళ్లీ మోసం చేసేందుకు వస్తుండటాన్ని సీఎం జగన్ తన ప్రచారపర్వంలో ఎండగట్టనున్నారు.
ప్రచార సన్నద్ధతపై వరుసగా సమీక్షలు
ఎన్నికల ప్రచారానికి సన్నద్ధతపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో కలిసి సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలతో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డితో కలిసి సజ్జల చర్చించారు. శనివారం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలతో ప్రచార సన్నద్ధతపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ ప్రాంత పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో కలిసి సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment