సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్ట్‌లో జాప్యం జరగడానికి చంద్రబాబే కారణమన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అలాగే, పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీపడండి.. గూండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమని చురకలంటించారు.
కాగా, మార్గాని భరత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ హయాంలో ఏం జరిగిందో.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రండి. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రానికే విడిచిపెట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయ్యేది. గతంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టారీతిన పనులు చేసింది. ఒక క్రమ పద్దతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరద వచ్చినప్పుడు డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది.
స్పిల్ వే, స్పిల్ ఛానల్, హైడ్రాలిక్ గేట్స్, లోవర్, అప్పర్ డ్యామ్‌లు వైఎస్సార్‌సీపీ హయాంలోనే పూర్తి అయ్యాయి. కాపర్ డ్యామ్ జీవితకాలం మూడేళ్లు మాత్రమే.. ఇప్పుడు నూతన డయాఫ్రం వాల్ నిర్మిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలి. జగనన్న అధికారంలోకి వచ్చాక పోలవరం సవరించిన అంచనాలు 55,000 కోట్ల రూపాయలకు ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఎకరం భూమి వెయ్యి రూపాయలు నామమాత్రపు లీజుకు తీసుకున్న మాట వాస్తవం కాదా?. మీ పార్టీ కార్యాలయాలు ఎప్పుడైనా కూలగొట్టే ప్రయత్నం చేశామా?. పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్‌లో భూమి తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు మార్చి వేశారు ఇది నిజం కాదా?. సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ-9 ప్రసారాలు నిలిపి వేయించి మీడియాపై జులుం చూపిస్తున్నారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన చేశాం. పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అప్పటి శిలాఫలకాలు ధ్వంసం చేసి రెండోసారి శంకుస్థాపన చేయటం ఎంతవరకు సమంజసం?.
పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీ పడండి. గుండాగిరిలో మీతో మేము పోటీ పడలేము. నా కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాజమండ్రి నగరాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు రెండోసారి శంకుస్థాపన చేయటం దారుణం. మా పార్టీ నేతల ఇళ్లపై దొమ్మీలకు పాల్పడుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment