సాక్షి, తాడేపల్లి: పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. బందిపోటు ముఠా మాదిరిగా చంద్రబాబు వ్యవహరించారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఏం చెప్పాల్లో తెలియక ఇలా అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించారు. ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చంద్రబాబు ఎందుకు వెళ్లలేదు?. బ్లాక్ క్యాట్ కమాండోలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఏం చెప్పాలో తెలియకే ఇలా అలజడులు సృష్టిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం గూండాలను అక్కడికి రప్పించారు.
పెద్దిరెడ్డి హీరో..
వైఎస్సార్‌సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క హీరో. కుప్పంలో చంద్రబాబునే కుప్పకూల్చి కింద కూర్చోబెట్టారు. స్థానిక సంస్థల్లో అన్ని స్థానాల్లో ఓడించారనే ఈర్ష్యతోనే పెద్దిరెడ్డిపై చంద్రబాబు కుట్ర పన్నారు. చంద్రబాబు వ్యవహారంపై విచారణ జరపాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని ఓర్వలేకనే చంద్రబాబు గొడవలు సృష్టించి లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
పవన్ ఎందుకు స్పందించలేదు?
తాను కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. నిన్న అంతమంది పోలీసులు గాయపడితే ఎందుకు మాట్లాడలేదు?. దత్త తండ్రి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావ్?. పిల్లల్ని రెచ్చగొట్టి గొడవలు చేయినే వారి భవిష్యత్ ఏంటి?. వారి కుటుంబాల గురించి ఆలోచించరా?. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవులు ఇస్తామని లోకేశ్ అంటున్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేయాలనుకుంటున్నారా?. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉండి జనాన్ని రెచ్చగొట్టడమేంటి?. నిన్నటి రోజు బ్లాక్ డే. ఏం సాధించారని గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తారు?. గవర్నర్‌కు అన్ని వాస్తవాలు తెలుసు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లపై విచారణ జరపాలి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధశ్వేరి వాస్తవాలను మభ్యపెట్టి మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
చంద్రబాబువి పాతతరం పాలిటిక్స్: ఎంపీ భరత్
పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడులు చేయించడం అమానుషమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు తగిన గుణాపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎంపీ భరత్ శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణులు ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడులు చేసినట్టు కనిపిస్తోంది. అనుమతి ఉంటే వారిని పోలీసులు ఎక్కడా ఆపరు. యువతను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు భావించారు. చంద్రబాబువి పాతతరం రాజకీయాలు. ఆయన చిప్ అప్డేట్ కావాలి. తనను తాను రాజ్యాంగేతర శక్తిగా చంద్రబాబు భావిస్తున్నారని చురకలు అంటించారు.
చంద్రబాబు భాష బాగాలేదు
సాక్షి, ఢిల్లీ: పుంగనూరు ఘటనలో బాధ్యులను శిక్షించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. కాగా, శ్రీనివాస రావు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భాష బాగాలేదు. పుంగనూరు దాడి ఘటనలో బాధ్యులను శిక్షించాలి. బీజేపీ తరఫున జనసేన ఏజెంట్‌గా పనిచేస్తోంది. బీజేపీ, టీడీపీ కలిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. పోలవరంపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: ‘పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే..’
Comments
Please login to add a commentAdd a comment