ఏపీలో మాఫియా రాజ్యం
రాక్షస పాలనలో ప్రజలకు అండగా నిలబడదాం
వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షునిగా భూమన బాధ్యతల స్వీకారం సభలో పార్టీ సీనియర్ నేతలు
సభకు భారీగా హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఏపీలో మాఫియా రాజ్యమేలుతోంది. ఈ రాక్షస పాలనలో ప్రజలకు అండగా నిలబడదాం. కలిసికట్టుగా ఉద్యమిద్దాం. కూటమి అరాచకాలపై తిరుపతి నుంచే తిరుగుబాటు చేద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ హామీలని చెప్పి చంద్రబాబు మోసం చేస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతోందని, మద్యం దుకాణాలు తెరవక ముందే టీడీపీ నేతలు దుకాణాలు తెరిచారని విమర్శించారు.
ప్రజలు బంగారు పళ్లెంలో పెట్టి మనకు తిరిగి అధికారం ఇస్తారన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే సహించనని చెప్పిన పవన్‌కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నారని ప్రశి్నంచారు. ఇది ‘ఈవీఎం’ ప్రొడక్షన్స్ వారి సీబీఎన్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు: విజయసాయి
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదని అన్నారు. ప్రజలకు సేవచేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు భూమన అని అన్నారు. తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని.. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని.. 2027 ఆఖర్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించేందుకు భూమన కృషి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు.
ప్రజలకు సంక్షేమం దూరమైంది: వైవీ
వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించారని గుర్తుచేశారు. నేడు ప్రజలు సంక్షేమ పథకాలు అందడంలేదని.. అభివృద్ధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామని, 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
తొలిరోజు నుంచే అరాచకాలు: సజ్జల
చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నాటి నుంచే రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఓ మాఫియా రాజ్యం ఏలుతోందని.. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కనిపించడంలేదన్నారు. 4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని.. అయితే వాటిని జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో సీఎం చంద్రబాబు రూ.53వేల కోట్లు అప్పుచేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయని ప్రశి్నంచారు. ఇకపోతే.. బలమైన కార్యకర్తల పారీ్టగా ఈసారి అధికారంలోకి వస్తున్నామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.
కష్టాల్లోనే వైఎస్ కుటుంబానికి మరింత అండగా.. : భూమన
చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భూమన మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలు చేసే సమయంలో తాను తుపాకి కాల్పుల వరకు వెళ్లి వచ్చిన వాడినని, చంద్రబాబుని ఢీకొనడం అంటే బెండుతో ఢీకొనడడం లాంటిదేనన్నారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలో ఉన్నప్పటి కంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు మరింత అండగా నిలబడతానని భూమన స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 25 ఏళ్ల యువకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఓడించడానికి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు చంద్రగిరిలో రంగంలోకి దించారని.. లోకేశ్ 6 రోజులు పాదయాత్ర చేసి మోహిత్ ఓటమి కోసం పనిచేశారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment