
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సీరియస్ అయ్యారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను చంద్రబాబు, పవన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్.. ప్రజాకోర్టులు అంటే సినిమాల్లో కోర్టులు కాదు. రీమేక్ వకీల్‌సాబ్ సినిమాలో మీరు వకీలుగా కోర్టులో నటించినట్టు కాదని ఎద్దేవా చేశారు. మీరు.. మీ జనసేన నాయకుల అకృత్యాల గురించి ప్రజాకోర్టులో విచారిస్తారా? అని ప్రశ్నించారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడే బాలకృష్ణ.. తన మరదలను ఇబ్బందిపెట్టిన నారాయణలపై మీరు చర్యలు తీసుకోగలరా?. ప్రజాకోర్టు అంటున్నారు.. ఇప్పటికే మేము ఎన్నికలు అనే ప్రజాక్షేత్రంలో సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని సీట్లకు పోటీ చేస్తారో చెప్పగలరా?.
మీ పార్టీ వీర మహిళా విభాగం పేరులో వీరత్వం ఉంది కానీ.. మహిళల రక్షణ విషయంలో లేదు. అసలు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా మహిళల అభివృద్ధి గురించి సమావేశం ఏర్పాటు చేశారా?. ఇంట్లో మహిళలకు ఎంతగా భద్రత ఇవ్వాలో.. అంతకన్నా ఎక్కువ భద్రత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో మహిళలను విమర్శించడం మినహా పవన్‌కు మరో పనిలేదు. సీఎం జగన్ పాలనలో 1500 మంది మహిళా పోలీసులను నియమించారు.. టీడీపీ హయాంలో అలాంటి ప్రయత్నం జరిగిందా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది..