సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈసీని కలిశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈసీతో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీస్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు మేము అవకతవకలకు పాల్పడుతున్నామని ఆయన అంటుంటే దొంగే దొంగ అన్నచందాన ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు.
2014-19 వరకు బాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని, ఆ లెక్క సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తూనే దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీదేనని అన్నారు. వెంటనే ఓటరు కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని.. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకతతో జరిపించాలని ఈసీని కోరినట్టు స్పస్టం చేశారు. ఈ దఫా అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు జరిగిందని 2019లో 3,98,34776 ఓట్లు ఉంటే, ఇప్పుడు 3,97,96,678 ఓట్లు ఉన్నాయని తెలిపారు.
ఏపీలో ఎక్కడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని అన్నారు. ఎన్నికలకు నిజమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. చంద్రబాబు సేవా మిత్ర, మై టీడీపీ ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, టీడీపీ ఓటరు ప్రొఫైలింగ్ ఆపాలని ఈసీని కోరినట్టు తెలిపారు. దీనిపై ఈసీ ఫుల్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: చంద్రయాన్-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్ రూట్ మార్చిన ఇస్రో
Comments
Please login to add a commentAdd a comment