సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ట రాజకీయాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బి.వై. రామయ్య ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు శిఖండిలా మారాడని.. తర్వలోనే ఆయన రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బి.వై. రామయ్య మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రజా సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచే చంద్రబాబు ప్రజలపై విషం కక్కుతున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే చంద్రబాబు, ఆయన కొడుకు పనిగా పెట్టుకున్నారు. ప్రజలకు ఎంతో అవసరమైన అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే కుటిల రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని’ రామయ్య మండి పడ్డారు. (చదవండి: కొనసాగుతున్న కోలాహలం)
‘మహిళలకు మేలు జరిగే సంక్షేమ పథకాలను అడ్డుకునే చంద్రబాబు మహిళా ద్రోహిగా చరిత్రలో మిగిలిపోనున్నాడు. చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తల వ్యవహరించే నిమ్మగడ్డను అస్త్రంగా వాడుకుంటూ అత్యున్నత రాజ్యాంగ పదవికి కళంకం తెచ్చారు. విలువలు మరిచిన నిమ్మగడ్డ దేశంలో ఎక్కడా లేని విధంగా తన హోదాను, పదవిని దుర్వినియోగం చేశారు. కుట్ర పూరిత రాజకీయాలను ప్రజలే తిప్పికొట్టాలి.. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సాహిస్తున్న చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలి’ అని బి.వై రామయ్య పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment