మీరే కదా బాబూ.. లిక్కర్‌ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Fires On Chandrababu Govt Liquor Mafia | Sakshi
Sakshi News home page

మీరే కదా బాబూ.. లిక్కర్‌ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్‌ జగన్‌

Published Tue, Oct 15 2024 5:21 AM | Last Updated on Tue, Oct 15 2024 12:30 PM

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt Liquor Mafia

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ జగన్‌

ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి మీవారికి అప్పగింత అవినీతికి స్కెచ్‌ కాదా? 

మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటు చేసి షాపులను కొట్టేయడం నిజం కాదా? 

ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి, మద్యం రేటు తగ్గించి, మద్యం నాణ్యత తగ్గించి, మద్యం అమ్మకాలు పెంచడం.. డిస్టిలరీల ద్వారా లంచాలు తీసుకోవడానికి కాదా? 

ఎమ్మార్పీపై రేట్లు పెంచి వసూలు చేయడానికి అనుమతినిచ్చి నీ మాఫియా ద్వారా వసూళ్లలో వాటా పొందడం నిజం కాదా? 

చదువులు, ఇతర బాగోగుల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లో వేసుకునేందుకు పన్నిన అవినీతి పథకం కాదంటారా?

ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారే కానీ ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడం లేదు?  

లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాల మీద అబద్ధాలాడి మీ స్వార్థంతో 15 వేల మందిని రోడ్డు పాలు చేస్తారా? 

మీ పాలసీ నిజంగానే గొప్పదైతే మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో బెదిరింపులు ఎందుకు?.. అవినీతి ధ్యేయంగా తెచ్చిన లిక్కర్‌ పాలసీతో రాష్ట్రాన్ని వెనక్కి లాగుతున్నారు 

తక్షణమే సరిదిద్దుకోండి.. లేదంటే ప్రజలు తిరగబడతారు  

సాక్షి, అమరావతి: ‘లిక్కర్‌ మాఫియా, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. మీ అక్రమార్జన కోసం.. మీకు, మీ వారికి అవినీతి డబ్బు సంపాదించడంకోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్‌ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. 

‘అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్లే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమన బాట పట్టించారు. అవినీతే ధ్యేయంగా తెచ్చిన లిక్కర్‌ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజలు తిరగబడతారు’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన లిక్కర్‌ పాలసీని తీవ్రంగా తూర్పారబడుతూ సోమవారం తన ‘ఎక్స్‌’  ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. అందులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...     

1 లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా రాష్ట్రం
లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీ వారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతి కోసం వేసిన స్కెచ్‌ కాదా? మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటు చేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్ద మొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీల ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేల కోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా?  

2 వాటాలు వాస్తవం కాదా?
చంద్రబాబూ.. మీరు తెచ్చిన లిక్కర్‌ పాలసీ గొప్పదే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకింత.. నాకింత’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్‌ కాదా? లైసెన్స్‌ ఫీజులతో పాటు కింద నుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీ వారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడం కోసం లిక్కర్‌ కొనుక్కున్న వారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టే కదా? మీకు ఇంత.. వారికి ఇంత.. చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువుల కోసం, ఇతర బాగోగుల కోసం ఖర్చు కావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా?

3 ఎమ్మార్పీపై రేట్లు పెంచేసి..  
కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్‌ లిక్కర్‌ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీని కోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టిలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు ఎమ్మార్పీ మీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడ కూడా మీకు ఇంత.. నాకు ఇంత.. అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగ్గొట్టడం కాదా   చంద్రబాబూ?

4 ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా చంద్రబాబు
ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తయినా పనిచేసినట్టవుతుంది. చంద్రబాబూ.. ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయం కోసం ఆ లక్ష్యానికి తూట్లు పొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కానీ.. రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడం లేదు? కారణం.. ఈ కొత్త పాలసీలో మీ సొంత లాభం ఉండబట్టే కదా?  

లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?

5 నాడు ఏరులై పారించారు.. మళ్లీ  ఇప్పుడు..
2014–19 మధ్య ఇదే మాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్‌ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. అప్పట్లో మీ సిండికేట్లు బడి పక్కన, గుడి పక్కన బెల్టు షాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయి. కాగితాల మీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్‌ రూమ్స్, దీనికి తోడుగా 43 వేల బెల్టు షాపులతో లిక్కర్‌ ఏరులై పారింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించింది. 

మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్‌ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసింది. లాభాపేక్ష లేనందున పర్మిట్‌రూమ్స్, బెల్టు షాపులు.. ఇవన్నీ రద్దయ్యాయి. ఈ పద్ధతిని ఇప్పుడు ఎత్తి వేసి, దుకాణాల సంఖ్యను మళ్లీ పెంచి మొత్తం అన్నింటినీ మీ మనుషులకు అప్పగించారు. ఇక వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్‌రూమ్స్, బెల్టు షాపులకు లెక్కే లేదు. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వపు దారుణ పరిస్థితులకు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబూ..?  

6 రోడ్డున పడ్డ 15 వేల మంది సంగతేంటి?  
లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాల మీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు.. మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో పనిచేస్తున్న 15 వేల మంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డున పడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబూ?  

7 సరిదిద్దుకోండి.. లేకుంటే ప్రజలు తిరగబడతారు
చంద్రబాబూ మీ అక్రమార్జన కోసం, మీకు, మీ వాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడం కోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్‌ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమనం పట్టించారు. అవినీతే ధ్యేయంగా తెచ్చిన లిక్కర్‌ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజలు తిరగబడతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement