సాక్షి, తిరుపతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనలో తుడిచి కొట్టుకు పోతామన్న భయాందోళనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చి అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబు అండ్‌కో, ఎల్లోమీడియా స్క్రిప్ట్ ప్రకారమే ఆమె విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త, తిరుపతి ఎంపీ గురుమూర్తి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా ‘సిద్ధం’ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఆయన హామీలకు ఉంటుందా? బాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదని, అందుకే కుప్పంతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల జాడే లేకుండా పోయిందన్నారు.
సామాన్యులే సీఎం వైఎస్ జగన్‌కు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లని ధీమా వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, 2014లో అధికారంలోకి రాగానే 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, డ్వాక్రా మహిళల కోసం ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు.
గతంలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తేనే సంక్షేమ పథకాలు అందేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, గడప గడపకు వెళ్లి వలంటీర్లు అర్హులందరికీ అందిస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 3న అనంతపురంలో ‘సిద్ధం’ కార్యక్రమంలో పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment