అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకుంటాం  | YSRTP Chief YS Sharmila Comments On Telangana Cm KCR | Sakshi
Sakshi News home page

అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకుంటాం 

Published Fri, Mar 18 2022 2:59 AM | Last Updated on Fri, Mar 18 2022 2:59 AM

YSRTP Chief YS Sharmila Comments On Telangana Cm KCR - Sakshi

సదస్సులో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల 

భూదాన్‌పోచంపల్లి: ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తామని, అప్పుడు చేనేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని వంకమామిడి, దంతూర్, కనుముకుల, భీమనపల్లి మీదుగా భూదాన్‌పోచంపల్లి వరకు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన చేనేత సదస్సులో షర్మిల మాట్లాడారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికులకు రుణమాఫీ చేశారని, నూలుపై సబ్సిడీ, నేతన్నలకు బీమా అందించారని గుర్తు చేశారు. నేడు నూలు ధరలు పెరిగి, గిట్టుబాటు లేక అప్పుల బాధతో 50 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిని అధికార పార్టీ నాయకులు కనీసం పరామర్శించలేదని, ఎక్స్‌గ్రేషియా చెల్లించిన పాపాన పోలేదని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పులు, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆదుకోని సీఎం కేసీఆర్‌ ఇప్పుడు దేశాన్ని ఏలబోతాడంటా అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని, సబ్సిడీ రుణాలు, మగ్గానికి ఉచిత కరెంట్, సబ్సిడీపై నూలు, రంగులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగ్రాం కోర్డినేటర్‌ రాజగోపాల్, రాష్ట్ర ప్రచార కన్వీనర్‌ నీలం రమేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement