
మాటాముచ్చట కార్యక్రమంలో మాట్లాడుతున్న షర్మిల
భువనగిరి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల పేరుతో మళ్లీ మీ ముందుకు వస్తారని, ఆయన గారడీ మాటలను ప్రజలు నమ్మవద్దని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొల్లేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘మాటా ముచ్చట’కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో రైతులకు ‘రైతుబంధు పథకం’తప్ప మరే ఇతర పథకాలు ప్రవేశపెట్టలేదని, ఎకరానికి రూ.5 వేలు ఇస్తూ రూ.25 వేలు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మూగబోయాయని, అందుకే ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించినట్లు తెలిపారు. నిరుద్యోగులు తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.