అధికారంలో ఉన్న కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాను గాలికొదిలేశావు. జిల్లాలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను విస్మరించావు. ప్రధానంగా జిల్లా వాటాగా పంపిణీ చేయాల్సిన సాగర్ జలాలు ఇవ్వకపోవడంతో పశ్చిమ ప్రకాశం ఐదేళ్లూ కరువుతో విలవిల్లాడింది. తాగునీటికీ కటకటలాడింది. పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. సాగు, తాగునీటిని తీర్చే కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశావు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను ఎండబెట్టావు. జిల్లా అంతా కరువు విలయ తాండవం చేసింది. ఇదిగో.. అదిగో అంటూ రామాయపట్నం పోర్టుకు రూపాయి నిధులు కేటాయించకుండా.. డీపీఆర్ రూపొందించకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా స్టిక్కర్ శిలాఫలకం వేశావు. మెరుగైన వైద్య సేవలు అందక విలవిల్లాడిన పశ్చిమ ప్రకాశంలో కనీసం మెడికల్ కళాశాల కట్టే ఆలోచన కూడా చేయలేదు. ప్రకాశానికి ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావో ప్రజలకు చెప్పు చంద్రన్న..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటేనే కరువు, కాటకాల జిల్లా. సాగునీరు సంగతి దేవుడెరుగు 2014 నుంచి 2019 ఏప్రిల్ వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో తాగునీటికి కూడా గగనమయ్యేది. ఒకపక్క ఏడాది పొడవునా వర్షాలు పడకపోవటంతోపాటు జిల్లాకు రావాల్సిన నాగార్జున సాగర్ జలాలను సైతం టీడీపీ పాలకులు సక్రమంగా రాబట్టేవారు కాదు. దీంతో జిల్లాలో కరువు కరాళ నృత్యం చేసేది. గ్రామాలకు గ్రామాలు జిల్లాను వీడి పట్టణాలు, నగరాలకు వలసలు వెళ్లేవారు. పంటల సంగతి ఎలా ఉన్నా తాగునీటి కోసం కిలో మీటర్లకొద్దీ వెళ్లి బిందెడు నీళ్లు తెచ్చుకొని గొంతు తడుపుకొనే పరిస్థితి ఆనాడు నెలకొంది.
ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చేసింది శూన్యం. అప్పటి టీడీపీ ప్రభుత్వ పాలనకు ఇప్పటి వైఎస్సార్‌సీపీ పాలనలను జిల్లా ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి భిన్నంగా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు పశ్చిమ ప్రకాశంలో పర్యటించేందుకు చంద్రబాబు వస్తున్నాడు. బుధవారం సాయంత్రానికి గిద్దలూరు నియోజకవర్గానికి చేరుకుంటున్న చంద్రబాబు గురు, శుక్రవారాల్లో మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పర్యటించి ముసలికన్నీళ్లు కార్చేందుకు వస్తున్నాడు.
ఒక్క సంవత్సరం కూడా వరికి సాగర్ నీరు పూర్తిగా ఇవ్వలేని చంద్రబాబు:
ఐదేళ్ల పాలనలో ఒక్క సంవత్సరం కూడా జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద వరికి సాగర్ నీరు ఇవ్వలేని చంద్రబాబుపై అప్పట్లో జిల్లా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక పుష్కలంగా జిల్లాకు సాగర్ జలాలు అందాయి. దీంతో పంటలు బాగా పండి ఉపాధి దొరికి వలసలకు చరమగీతం పాడినట్లయింది.
వెలిగొండ పాపం చంద్రబాబుదే..
జిల్లాకు అత్యంత ముఖ్యమైనది ప్రాజెక్టు వెలిగొండ. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏమాత్రం పట్టించుకోకుండా వెలిగొండ పనులు గాలికి వదిలేసిన సంగతిని ఇక్కడి ప్రజలు మర్చిపోలేదు. ఒకటో టన్నెల్‌ను కేవలం ఐదు కిలో మీటర్లు కూడా పూర్తిచేయలేకపోయారు. తన సొంత మనిషి సీఎం రమేష్‌కు కాంట్రాక్టు ఇప్పించి రూ.కోట్లు కొల్లగొట్టాడు తప్ప ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తి చేశారు. రెండో టన్నెల్ కూడా ఈ సెప్టెంబరు, అక్టోబరులో పూర్తి చేసి... అక్టోబరులో మళ్లీ వచ్చి ఆ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఇటీవల మార్కాపురం వచ్చిన సీఎం జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. రెండో టన్నెల్ ఇక మిగిలి ఉన్నది 1.8 కిలోమీటర్లు మాత్రమే. మరో ఐదారు నెలల్లో పూర్తి చేసి నల్లమల సాగర్‌ను ప్రారంభిస్తానని భరోసా ఇచ్చారు.
రామాయపట్నం పోర్టును వదిలేశాడు...
ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల ఆకాంక్ష, యువతకు ఒక భరోసా అయిన రామాయపట్నం పోర్టును గాలికి వదిలేశాడు చంద్రబాబు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు వచ్చి పైలాన్‌ను ఆవిష్కరించి మ...మ అనిపించాడు. అది కూడా ఉత్తుత్తికే అన్న చందంగా తయారు చేశాడు తప్ప జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. జిల్లా నుంచి వామపక్ష నేతలు, తన పార్టీ నేతలు వెళ్లి జిల్లా అభివృద్ధికి సాయం చేయండి అని అడిగితే ‘‘ప్రకాశం జిల్లా నాకేమి ఇచ్చింది...ఎన్ని సీట్లిచ్చింది’’ అని నిస్సిగ్గుగా అన్న వేసిన విషయాలను ఎలా మరిచి పోతారని ప్రజలు నిలదీస్తున్నారు. అదే సీఎంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసి పోర్టు నిర్మాణాన్ని వేగంగా చేపట్టారు.
కరువు, దాహార్తితో విలవిల్లాడిన ప్రజలు:
చంద్రబాబు..కరువు అన్నదమ్ములని జిల్లా ప్రజలు గత అనుభవాలను నెమరేసుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో 2015 నుంచి 2019 వరకు జిల్లా కరువు కోరల్లో విలవిల్లాడిపోయింది. ఐదేళ్లు అన్ని మండలాలను కరువు మండలాలుగా స్వయంగా టీడీపీ ప్రభుత్వమే ప్రకటించింది. అయినా పంటలు నష్టపోయిన రైతులకు మాత్రం పంటల నష్ట పరిహారం ఇవ్వకుండానే దిగిపోయారు. ఆ పంట నష్టపరిహారాలను మాత్రం సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఇచ్చారు. జిల్లాతో పాటు ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో మంచినీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. అయితే దానిని కూడా తెలుగు తమ్ముళ్లు వదిలిపెట్టలేదు. మంచినీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశామంటూ నెలకు రూ.కోటి ఖర్చు పెట్టి రూ.3 కోట్లు దోచుకున్నారు. ట్యాంకర్లకు దొంగలెక్కలు చూపించి తాగునీటి అవసరాల పేరుతో ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు.
పశ్చిమ ప్రకాశాన్ని ఆదుకున్న సీఎం వైఎస్ జగన్:
గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా సీఎం వైఎస్ జగన్ పశ్చిమ ప్రకాశం జిల్లాను ఆదుకున్నారు. వైద్యం అందక అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఘనత జగన్‌కే దక్కింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా వెచ్చించి ఇప్పటికే పనులు ప్రారంభించారు. దోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను కూడా మంజూరు చేశారు. వెలిగొండతో పాటు పుల్లలచెరువు మండల ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు తీగలేరుపై టీ–5 చానల్ ద్వారా నీటిని అందించేందుకు రూ.82 కోట్లు మంజూరు చేశారు. ఇక గ్రామ సచివాలయాల ద్వారా నల్లమల మారుమూల గ్రామాల్లో సైతం ప్రభుత్వ సేవలు ఆయా గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు నేరుగా ఒకటో తేదీనే ఇంటికి గిరిజన గ్రామాల్లోనే అందిస్తున్నారు. ఇక జగనన్న కాలనీలు గ్రామగ్రామాన వెలిశాయి. గిద్దలూరు నియోజకవర్గంలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 12న మార్కాపురం వచ్చినప్పుడు సీఎం అనేక సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment